
మహానటులు నందమూరి తారకరామారావు శ్రీరాముడిగా నటించిన సంచలనాత్మక చిత్రం ” లవకుశ ”. సి. పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు అయిదేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంది. ఆర్ధిక కారణాలతో అయిదేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాను ప్రారంభించింది సి. పుల్లయ్య అయినప్పటికీ చిత్రీకరణ పూర్తి చేసింది మాత్రం ఆయన తనయుడు సీఎస్ రావు. పుల్లయ్య అనారోగ్యంతో మంచాన పడటంతో దాన్ని పూర్తి చేసాడు తనయుడు.
1963 మార్చి 29 న ఆంధ్రదేశమంతటా విడుదల అయ్యింది లవకుశ. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు అఖండ విజయాన్ని అందించారు. అప్పట్లోనే ఈ సినిమా కోటి రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. అంటే ఇప్పటి లెక్కల ప్రకారం ఎంత లేదన్నా 3 వేల కోట్లకు పైమాటే. ఈ సినిమా కేవలం తెలుగులో అలాగే తమిళనాట కొన్ని ప్రదేశాల్లో , కర్ణాటక లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విడుదల అయ్యింది. ఇప్పటిలా పాన్ ఇండియా చిత్రం అయితే బాక్సాఫీస్ ను కుమ్మేసేదే . ఎన్టీఆర్ శ్రీరాముడిగా నటించగా అంజలీదేవి సీతమ్మగా నటించింది. ఇక కీలక పాత్రల్లో శోభన్ బాబు , కాంతారావు , మాస్టర్ నాగరాజు , మాస్టర్ సుబ్రహ్మణ్యం , చిత్తూర్ నాగయ్య , కన్నాంబ తదితరులు నటించారు.
లవకుశ లాంటి అద్భుత చిత్రం ఇంతవరకు రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆయా పాత్రల కోసమే ఆయా నటీనటులు పుట్టారా ? అనిపించేలా జీవించారు…… ప్రేక్షకులను మైమరిపించారు. ఇక ఈ చిత్రంలో అద్భుతమైన పాటలు కూడా కుదిరాయి.” జయజయ రామా ” , ” రామన్న రాముడు …… కోదండరాముడు ” , ” విరిసే చల్లని వెన్నెల ” , ” ముద్దుమోము ” , ” వల్లనోరి మామా నీ పిల్లను ” , ” ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ” , ” జగదభిరాముడు శ్రీరాముడే ” , ” రామకథను వినరయ్యా ” , ” వినుడు వినుడు రామాయణగాథ ” , ” శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ” , ” ఎందుకె నామీద కోపం ” , ” ఊరికే కన్నీరు నింప కారణమేమమ్మా ” , ” శ్రీరామా సుగుణధామా ” , ” సందేహించకుమమ్మా ” , ” అశ్వమేధయాగానికి జయము ” , ” లేరు కుశలవుల సాటి ” , ” శ్రీరామ పరంధామ ” , ” అంటూ సాగే మొత్తం 17 పాటలతో పాటుగా పలు పద్యాలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
లవకుశ చిత్రం విడుదలై సరిగ్గా నేటికి 60 సంవత్సరాలు. సరిగ్గా ఆరు దశాబ్దాల క్రితం 1963 మార్చి 29 న విడుదల అయ్యింది. ఆనాటి సంచలనానికి 60 ఏళ్ళు అయిన ఇదే రోజున అన్న నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు కూడా మార్చి 29 నే కావడం గమనార్హం. టీడీపీ స్థాపించి 41 సంవత్సరాలు కావడంతో ఆ వేడుకలను జరుపుకుంటున్న సమయంలోనే లవకుశ 60 సంవత్సరాల వేడుక జరుగుతుండటం విశేషం. దాంతో అన్నగారి అభిమానులు రెండు పండగలను జరుపుకుంటున్నారు.






