రామ్ చరణ్ హీరోగా నటించిన రెండో చిత్రం ” మగధీర ”. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం 2009 లో విడుదలై తెలుగు చలన చిత్ర రికార్డులను అన్నింటినీ బద్దలుకొట్టింది. ఒక తెలుగు సినిమాకు ఇంతటి స్టామినా ఉందా ? అని ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యపోయేలా వసూళ్ల సునామీ సృష్టించింది.
కట్ చేస్తే ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది గీతా ఆర్ట్స్. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ మళ్ళీ విడుదల చేస్తుండటం అవి భారీ వసూళ్లను సాధిస్తుండటం తెలిసిన విషయమే ! దాంతో మగధీర చిత్రాన్ని కూడా మళ్ళీ భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మార్చి 27 న హీరో రాంచరణ్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్బంగా మగధీర చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27 న భారీ ఎత్తున విడుదల కానుంది మగధీర. చరణ్ రెండు విభిన్న పార్శ్వాలున్న పాత్రలను అద్భుతంగా పోషించి మెప్పించాడు. ఇక హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అందాలతో అలరించింది. ఎం ఎం కీరవాణి సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. మగధీర లాంటి చిత్రం మళ్ళీ విడుదల అంటే మెగా అభిమానులకు సంతోషమే !.