
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో దొంగ పడ్డాడు. అయితే వస్తువులు ఏవి దోచుకోలేదు. దొంగతనం కోసం వచ్చిన ఆగంతకుడు ప్రహరీ గోడ ఎక్కి కిందపడటంతో గాయాలయ్యాయి. దాంతో మహేష్ బాబు ఇంట్లో ఉండే పనివాళ్ళు ఆ దొంగను పట్టుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగ అని తేలడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాంతో పోలీసులు వచ్చి ఆ దొంగను పట్టుకొని ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 81 లో మహేష్ బాబు నివాసం ఉంది. అధునాతనమైన ఆ బిల్డింగ్ ప్రహరీ గోడ చాలా ఎత్తుగా నిర్మించారు. 30 అడుగులపైనే ప్రహరీ గోడ ఉంటుంది. ఇక ఒడిశా రాష్ట్రానికి చెందిన కృష్ణ అనే యువకుడు మహేష్ బాబు ఇంటికి దగ్గరలో గల నర్సరీలో పనిచేస్తున్నాడు.
అయితే కష్టపడితే వచ్చే డబ్బులు సరిపోవు కాబట్టి ఇలా దొంగతనానికి ప్లాన్ చేసాడట. నిన్ననే మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. తల్లి మరణించడంతో అందరూ మరో ఇంటికి వెళ్లారు. అందరూ తల్లి మరణించిందని విషాదంలో ఉంటే ఇదే మంచి అవకాశమని భావించిన దొంగ దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు.