మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా 69 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. విజయదశమి రోజున అక్టోబర్ 5 న భారీ ఎత్తున విడుదలైంది గాడ్ ఫాదర్ చిత్రం. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి , నయనతార , సత్యదేవ్ , సునీల్ , సల్మాన్ ఖాన్ తదితరులు నటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా కావడంతో తెలుగులో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే మెగాస్టార్ కున్న ఇమేజ్ తో పోల్చుకుంటే ఆ స్థాయి వసూళ్లు అయితే దక్కలేదు అనే చెప్పాలి. మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్లు వసూల్ చేయగా రెండో రోజున 31 కోట్ల వసూళ్లు వచ్చాయి. దాంతో రెండు రోజుల్లో 69 కోట్ల వసూళ్లు వచ్చాయి. అసలే దసరా సెలవులు ఆపై మెగాస్టార్ సినిమా కాబట్టి ఈపాటికి 100 కోట్లు అవలీలగా సాధించాలి. కానీ 70 కోట్ల లోపే వచ్చాయి.
దసరా రోజున మూడు సినిమాలు విడుదల కాగా అందులో మెగాస్టార్ చిరంజీవిదే అగ్రస్థానం. గాడ్ ఫాదర్ చిత్రం మెరుగైన వసూళ్లను రాబడుతోంది. ఇక మిగిలిన రెండు చిత్రాలైతే దరిదాపుల్లో కూడా లేవు. రెండు రోజుల్లో దాదాపు 38 కోట్ల షేర్ వచ్చింది. ఈ సినిమాను కొన్న బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే మరో 50 కోట్ల షేర్ రావాలి. మరి ఆ వసూళ్లను గాడ్ ఫాదర్ రాబడుతుందా ? లేదా ? చూడాలి.