
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారట దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు దర్శకుడు మోహన్ రాజా. ఇక ఈ చిత్రానికి U / A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో అక్టోబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది గాడ్ ఫాదర్ చిత్రం.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. మలయాళంలో మోహన్ లాల్ పోషించిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి పోషిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నయనతార , సునీల్ , సత్యదేవ్ నటిస్తుండగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ అందించిన కొన్ని పాటలు బాగా పాపులర్ అయ్యాయి.
దసరా తెలుగు వాళ్లకు అతిపెద్ద పండగ. దాంతో తెలుగు రాష్ట్రాలలో భారీగా సెలవులు కూడా. ఇంకేముంది అది గాడ్ ఫాదర్ కు బాగా కలిసి రానుంది. అసలే మెగాస్టార్ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రావాలే కానీ బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం.