మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. అయితే సినిమాల్లోకి వచ్చేసరికి చిరంజీవి గా మారారు. అందుకు పునాది పడింది పునాదిరాళ్లు చిత్రంతో . అంటే నటుడిగా మొదటి చిత్రంగా అవకాశం వచ్చిన చిత్రం పునాదిరాళ్లు అయితే మొదటగా విడుదలైన చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. దాంతో సాంకేతికంగా చిరంజీవి మొదటి చిత్రంగా ప్రాణం ఖరీదు చిత్రం అయ్యింది. ఇక అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాస్త చిరంజీవి అయ్యింది ఈ చిత్రంతోనే.
ప్రాణం ఖరీదు చిత్రం 1978 సెప్టెంబర్ 22 న విడుదల అయ్యింది. దాంతో నటుడిగా 44 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో చిన్న వేశాలతో పాటుగా విలన్ గా కూడా నటించాడు . ఆ తర్వాత తెలుగుతెరను ఏలాడు. మెగాస్టార్ గా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశాడు చిరు.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆ సినిమా అక్టోబర్ 5 న భారీ ఎత్తున విడుదల కానుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా అభిమానులు కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆచార్య మిస్ ఫైర్ కావడంతో వాళ్ళ ఆశలన్నీ గాడ్ ఫాదర్ మీదే ఉన్నాయి.