నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఇక రేపు ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారు. అది కూడా రాయలసీమ ప్రాంతమైన కర్నూల్ నగర నడిబొడ్డున అంటే …….. కర్నూల్ కొండారెడ్డి బురుజు దగ్గర భారీ ఎత్తున ఈవెంట్ చేస్తూ టైటిల్ ని ప్రకటించనున్నారు.
ఇక ఈ చిత్రానికి పలు రకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. రెడ్డి గారు , అన్నగారు , వీర సింహారెడ్డి , జై బాలయ్య అనే టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఫైనల్ గా ” వీర సింహారెడ్డి ” అనే టైటిల్ ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ టైటిల్ కు సంబందించిన ప్రింటింగ్ , డిజిటలైజేషన్ కూడా పూర్తయ్యింది. ఇక రేపు కొండారెడ్డి బురుజు దగ్గర అనౌన్స్ చేయడమే తరువాయి.
బాలయ్య పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ , కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదంటే జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.