హీరో నందమూరి తారకరత్న అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ నుండి ర్యాలీ గా తారకరత్న పార్దీవ దేహాన్ని మహాప్రస్థానం వరకు తరలించారు. రోడ్డు పొడవునా వేలాది మంది నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తారకరత్నకు వీడ్కోలు పలికారు. తారకరత్న అమర్ రహే అంటూ నినాదాలు ఇస్తూ నివాళులు అర్పించారు. తారకరత్న పార్దీవ దేహాన్ని తరలించే వ్యాన్ లోనే నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, విజయసాయి రెడ్డి తదితరులు వచ్చారు.
ఇక అంతకంటే ముందే మహాప్రస్థానంకు చేరుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ , నందమూరి కళ్యాణ్ రామ్, నారా లోకేష్ తదితరులు. తారకరత్న చితికి నిప్పంటించారు తండ్రి మోహన కృష్ణ. ఎదిగిన కొడుకు తన కళ్ళ ముందే విగత జీవిగా పడి ఉండటం మోహన కృష్ణ దంపతులను తీవ్రంగా కలిచివేసింది. తారకరత్న అంత్యక్రియల కార్యక్రమంలో పెద్ద ఎత్తున నందమూరి , నారా , దగ్గుబాటి కుటుంబాలు పాల్గొన్నాయి.