నాని హీరోగా నటించిన దసరా చిత్ర టీజర్ వచ్చేసింది. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దసరా టీజర్ ను విడుదల చేసారు. పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని విభిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమా కోసం తెలంగాణ భాషను బాగానే ఒంట బట్టించు కున్నాడు. అలాగే నాని గెటప్ కూడా ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం వేసవి కానుకగా మార్చి 30 న విడుదల కానుంది. సముద్రఖని , సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. దసరా టీజర్ బాగుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొనే అవకాశం కనబడుతోంది. ఇక టీజర్ ను దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి విడుదల చేయడం కూడా కొంత అనుకూలించే అంశమనే చెప్పాలి.