
మహా నటులు నందమూరి తారకరామారావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, రేలంగి తదితరులు కలిసి నటించిన అపురూపమైన దృశ్యకావ్యం నర్తనశాల. కమలాకర కామేశ్వర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నటి లక్ష్మీరాజ్యం తన భర్త శ్రీధర్ రావుతో కలిసి రాజ్యం పిక్చర్స్ పతాకంపై నిర్మించడం విశేషం. మహాభారతం లోని విరాటపర్వం ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని నర్తనశాల చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 1963 అక్టోబర్ 11 న విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం విడుదలై 59 సంవత్సరాలయ్యింది.
ఎన్టీఆర్ అర్జునునిగా నటించిన విషయం తెలిసిందే. అయితే శాపం వల్ల బృహన్నలగా మారుతాడు. బృహన్నల పాత్రలో ఎన్టీఆర్ ఆకట్టుకుంటాడా అనే సవాలక్ష అనుమానాలను పటాపంచలు చేసింది ఈ చిత్రం. సాధారణంగా ఒక మగాడు లేడీ వేషం వేస్తే కాస్త ఎబ్బెట్టుగానైనా ఉంటుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం బృహన్నల గెటప్ లో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. అసలు నర్తనశాల చిత్రానికి ఎన్టీఆర్ బృహన్నల గెటప్ హైలెట్ గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక మహానటుడు ఎస్వీ రంగారావు , సావిత్రి, రేలంగి, ముక్కామల , మిక్కిలినేని వంటి అతిరథమహారధులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సీనియర్ సముద్రాల ఈ చిత్రానికి రచన అందించగా దక్షిణామూర్తి సంగీతం అందించారు. నర్తనశాల చిత్రంలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. చరిత్ర సృష్టించిన ఈ చిత్రం విడుదలై 59 సంవత్సరాలు అవుతోంది. ఇక ఇదే చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ రీమేక్ చేయాలని అనుకున్నాడు. సినిమా ప్రారంభించాడు కూడా అయితే అనుకోని అవాంతరాలు రావడంతో నర్తనశాల చిత్రాన్ని పక్కన పెట్టాడు. అయితే ఎప్పటికైనా సరే నర్తనశాల చిత్రాన్ని నిర్మించాలని పట్టుదలగా ఉన్నాడు బాలయ్య. దానికి కాలమే సమాధానం చెప్పాలి.