నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ . మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు రెండో సీజన్ ని స్టార్ట్ చేసారు. ఇటీవలే సెకండ్ సీజన్ షూటింగ్ పార్ట్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే సెకండ్ సీజన్ ని ఎలాంటి గెస్ట్ తో ప్రారంభిస్తున్నారు అనే ఉత్కంఠ నెలకొంది. కట్ చేస్తే ఆ గెస్ట్ ఎవరో తెలిసిపోయింది.
ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో తెలుసా …….. ఇంకెవరు మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. బాలకృష్ణ – చంద్రబాబు ఇద్దరూ వియ్యంకులు అనే విషయం తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆ తర్వాత ప్రతిపక్ష నేత అయ్యారు. ఇక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు నారా చంద్రబాబు నాయుడు.
నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబును అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఇంటర్వ్యూ చేయడం ఖచ్చితంగా సంచలనం అయ్యే సన్నివేశం అనే చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశించేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఇంటర్వ్యూ తప్పకుండా ఉపయోగపడుతుంది. తన రాజకీయ జీవితంలో కీలక మలుపులను తప్పకుండా చెప్పే అవకాశం ఉంటుంది. అందునా 1995 వెన్నుపోటు ప్రస్తావన కూడా తప్పకుండా వస్తుంది. అయితే యధావిధిగా అందులో నాతప్పేమి లేదని , ఆనాటి పరిస్థితులను వెల్లడించడం ఖాయం.