
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ను బూతులు తిడుతున్నారు నెటిజన్లు , వెంకీని అమితంగా ఇష్టపడే అభిమానులు. వెంకటేష్ ను తిట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించడమే ఇందుకు కారణం. వెంకటేష్ – రానా ఇద్దరూ కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ నిన్నటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. వెంకీకి మహిళాభిమానులు ఎక్కువగా ఉన్నారు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరో కావడంతో పాటుగా ప్రేమ కథా చిత్రాలకు , కుటుంబ కథా చిత్రాలకు వెంకీ కేరాఫ్ అడ్రస్ కావడంతో మహిళా ప్రేక్షకుల మెప్పు ఎక్కువగా పొందాడు. కట్ చేస్తే రానా నాయుడు వెబ్ సిరీస్ చూసిన వాళ్ళు షాక్ అవుతున్నారు. వెంకటేష్ ఏంటి ? ఇలాంటి వెబ్ సిరిస్ లో నటించడం ఏంటి ?
మూడున్నర దశాబ్దాలుగా హీరోగా రాణిస్తున్న వెంకటేష్ ఇంతటి దారుణమైన వెబ్ సిరీస్ లో నటించాడా ? అంటూ నోరెళ్ళ బెడుతున్నారు. శృంగార సన్నివేశాలు , పచ్చి బూతులతో నిండిపోయింది ఈ వెబ్ సిరీస్ దాంతో వెంకటేష్ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు , నెటిజన్లు. హీరోగా ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు ఈ ఒక్క వెబ్ సిరీస్ తో పోగొట్టుకున్నాడని విమర్శలు చేస్తున్నారు.