మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉండే. ఆమేరకు ఎన్టీఆర్ ని కలవడం , మాట్లాడటం కూడా జరిగింది. అయితే అనూహ్యంగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో మహానటి చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర తొలగించారట. ఈ విషయాన్ని అగ్ర నిర్మాత అశ్వనీదత్ స్వయంగా వెల్లడించడం విశేషం.
బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నారు కాబట్టి మహానటి చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ చేత సీనియర్ ఎన్టీఆర్ గెటప్ వేయించడం వల్ల లేని పోని అపర్దాలు వచ్చే అవకాశం ఉండటంతో ఆ పాత్ర తొలగించాల్సి వచ్చింది. అందుకే నాగేశ్వరరావు – సావిత్రి కాంబినేషన్ లో ఎక్కువ సన్నివేశాలు పెట్టాల్సి వచ్చింది. నిజానికి ఎక్కువ చిత్రాలు కలిసి చేసింది కూడా అక్కినేని, సావిత్రి కావడంతో అలా కలిసి వచ్చిందని అంటున్నాడు అగ్ర నిర్మాత అశ్వనీదత్. అంతేకాదు సావిత్రి పాత్రలో మొదట మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ ని అనుకున్నారట. అయితే నిత్యా మీనన్ కథ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందట. దాంతో నిత్యా మీనన్ స్థానంలో కీర్తి సురేష్ ని ఎంపిక చేశారు. ఆమె సావిత్రి పాత్రకు ప్రాణం పోసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ – కె అనే పాన్ ఇండియా చిత్రాన్ని 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె తదితరులు నటిస్తున్నారు. గ్రాఫిక్స్ కు ఎక్కువగా స్కోప్ ఉన్న చిత్రం కావడంతో ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్ స్టార్ట్ చేశారట కూడా.