ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ బరిలో నిలవడం కోసం 80 కోట్లు ఖర్చు చేసారని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ అభిమానులు అలాగే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఆర్ ఆర్ ఆర్ రూపంలో లభిస్తే…… దానికి గర్వించాల్సింది పోయి విమర్శలు చేస్తావా ? అంటూ తమ్మారెడ్డి పై నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా గత ఏడాది మార్చిలో విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. అంతేకాదు నాటు నాటు అనే పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో పోటీకి నిల్చింది.
అయితే ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం నిలవడం కోసం పెద్దగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రమోషన్ కోసం ఏకంగా 80 కోట్లు ఖర్చు చేసారని ఆరోపిస్తున్నాడు తమ్మారెడ్డి. ఆ ఖర్చు విషయం పక్కన పెడితే ……. ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఊరికే రాదుగా …… అయినా ఆస్కార్ బరిలో నిలవడమే కాదు …… ఆస్కార్ అవార్డు కూడా దక్కుతుంది అని ….. అది భారతదేశ చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుందని తమ్మారెడ్డి ఇది గుర్తించాలని విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎన్టీఆర్ కొమురం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించగా కీలక పాత్రల్లో అజయ్ దేవ్ గన్ , శ్రియా శరన్ , అలియా భట్ , సముద్రఖని తదితరులు నటించారు. నాటు నాటు సాంగ్ పాటను చంద్రబోస్ రాయగా కీరవాణి సంగీతం అందించాడు. ఇక ఈ పాటను ఆలపించింది కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్. నాటు నాటు అనే పాటను లైవ్ లో వీళ్ళ చేత పాడించే ఏర్పాట్లు చేసారు మేకర్స్. మార్చి 12 మా ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు ఎన్టీఆర్ , చరణ్ లు కలిసి డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.