
మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో ఇటీవల కాలంలో ఎన్టీఆర్ గోల ఎక్కువయ్యింది. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా సరే అక్కడ జై ఎన్టీఆర్ , కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గోల గోల చేస్తున్నారు. దాంతో కొంత డిస్ట్రబెన్స్ అవుతోంది.
తాజాగా ఖమ్మం జిల్లాలో పర్యటించాడు చంద్రబాబు. కాగా ఆ పర్యటనలో కూడా ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ జెండాలను చేతబట్టుకొని కాబోయే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ …… ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ హంగామా చేసారు. అయితే కొంతమంది నాయకులు , కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. జై ఎన్టీఆర్ అంటూ గోల గోల చేసారు.
గతకొంత కాలంగా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ ఎక్కడ పర్యటించినా ఇలాగే గోల గోల చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. తెలుగుదేశం పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే అని నినాదాలు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇప్పట్లో రాజకీయాల గురించి ఆలోచించే తీరిక లేదని , తాతయ్య పార్టీ కోసం అవసరమైన సమయంలో సేవలు అందించడానికి సిద్దమే అని ప్రకటించాడు కూడా. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే …… నారా లోకేష్ పరిస్థితి ఏంటి ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అందుకే ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.