యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త……. ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా ? అని ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లకు తీపి కబురు అనే చెప్పాలి. ఎందుకంటే ఈనెల 23 న ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను అట్టహాసంగా ప్రారభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఆరోజు కేవలం ప్రారంభోత్సవం మాత్రమే సుమా ….. ఎందుకంటే అభిమానుల కోసమే ఈ ప్రారంభోత్సవం.
ఇక రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చి నెలాఖరున ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో పోర్ట్ సెట్ వేశారు. అందులోనే షూటింగ్ జరుగనుంది. ఇక ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు కానీ వినబడుతున్న కథనం ప్రకారం జాన్వీ కపూర్ ని ఎంపిక చేయనున్నారని సమాచారం. అలాగే సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా మరొక హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించనున్నాడు. యువ సుధ బ్యానర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనుంది. అలాగే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దాంతో అభిమానుల కోసం ఇలా కొత్త సినిమా ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 5 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.