
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మార్చి 23 న ఉదయం ఈ సినిమా ప్రారంభోత్సవం కేవలం కొద్దిమంది గెస్టుల సమక్షంలో ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ యువ సుధా ఆర్ట్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా ప్రారంభోత్సవంలో హీరో ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ కపూర్ , దిల్ రాజు , ప్రశాంత్ నీల్ , నందమూరి కళ్యాణ్ రామ్ , ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి – బోనీ కపూర్ ల కూతురు అయిన జాన్వీ కపూర్ కు తెలుగులో మొదటి చిత్రం కావడం విశేషం. శ్రీదేవి కూతురు జాహ్నవి హిందీలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కించుకోలేకపోయింది. అయితే క్రేజ్ మాత్రం బాగానే వచ్చింది ఈ భామకు.
ఈ సినిమా చాలాకాలం క్రితమే ప్రారంభం కావాల్సి ఉండే , అయితే రకరకాల కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈరోజు ప్రారంభమైంది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ నుండి జరుగనుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. దానికి తోడు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో ఎన్టీఆర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఇక ఎన్టీఆర్ 30 వ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ , హిందీ భాషలలో విడుదల కానుంది.