యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించిన బ్లాక్ బస్టర్ చిత్రం అదుర్స్ మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో పాత చిత్రాలను మళ్లీ విడుదల చేయడం అనే ట్రెండ్ మొదలైంది. అలా పలువురు స్టార్ హీరోల చిత్రాలు మళ్లీ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ఆ కోవలోనే ఎన్టీఆర్ అదుర్స్ చిత్రాన్ని మార్చి 4 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం పోషించగా చారి అనే పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. చారి పాత్రలో ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ గెటప్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అన్నింటినీ మించి ఎన్టీఆర్ పండించిన కామెడీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ సరసన అందాల ముద్దుగుమ్మలు నయనతార , షీలా నటించారు. అలాగే బ్రహ్మానందం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాడు. బ్రహ్మీ ఎపిసోడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కొడాలి నాని – వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించారు.
దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ప్రేక్షకులను విశేశంగా అలరించింది. 2010 లో విడుదలైన అదుర్స్ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇలాంటి సినిమా ఇంకా పెద్ద హిట్ కావాల్సి ఉండే. ఆ లోటు ఇప్పుడు భర్తీ అవుతుందని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4 న రీ రిలీజ్ అవుతున్న అదుర్స్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.