వెండితెరపై రారాజుగా వెలిగిపోవాలని నిమ్మకూరు నుండి మద్రాస్ లో అడుగుపెట్టారు నందమూరి తారకరామారావు. అయితే వెళ్లిన వెంటనే సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చి పడతాయని భావించారు అన్నగారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉండటంతో కొంత డీలా పడ్డారు. సరిగ్గా అలాంటి సమయంలోనే ”మనదేశం” చిత్రంలో పోలీస్ అధికారిగా ఓ చిన్న పాత్ర లభించింది ఎన్టీఆర్ కు.
అయిష్టంగానే ఆ పాత్ర చేసారు. ఉన్నది కొద్దిసేపు అయినప్పటికీ ఎన్టీఆర్ కు మంచి గుర్తింపునే తీసుకొచ్చింది ”మనదేశం” చిత్రం. శోభనాచల పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని కృష్ణవేణి నిర్మించారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎల్వీ ప్రసాద్. 1947 నవంబర్ 24 న ఈ చిత్రం విడుదల అయ్యింది.
విప్రదాస్ అనే బెంగాలీ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో తెరెకెక్కిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నాగయ్య , నారాయణరావు , రేలంగి , వంగర , కృష్ణవేణి , కాంచన్ , సురభి బాలస్వరస్వతి తదితరులు నటించారు.