ఎట్టకేలకు అఫీషియల్ గా ప్రకటించేసారు ఎన్టీఆర్ 30 మేకర్స్. ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసేది బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అని. గతకొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి హీరోయిన్ విషయంలో. అయితే అవి ఊహాగానాలు మాత్రమే కట్ చేస్తే ఇన్ని రోజులకు ఆ శుభవార్త తెలిపారు దర్శక నిర్మాతలు. ఎన్టీఆర్ 30 వ సినిమాకు దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.
ఎన్టీఆర్ సరసన నటించే భామ కోసం చాలా పెద్ద లిస్టునే చూసారు మేకర్స్. అయితే చివరకు జాన్వీ కపూర్ ను ఎంపిక చేసారు. ఇక జాన్వీ కపూర్ కూడా చాలా కాలంగా ఎన్టీఆర్ సరసన నటించాలని తహతహలాడుతోంది. ఈ విషయాన్ని పలుమార్లు ప్రకటించింది కూడా. అయితే అందుకు ఎన్టీఆర్ 30 వ సినిమా కారణం అవుతోంది. జాన్వీ కపూర్ కు ఇది సరైన టాలీవుడ్ ఎంట్రీ అని భావిస్తున్నారు. ఈరోజు అందాల భామ జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడంతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ టీమ్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇంతకుముందు జనతా గ్యారేజ్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మధ్యలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య అట్టర్ ప్లాప్ కావడంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యింది.
అయితే ఎట్టకేలకు కథ , కథనం లాక్ కావడంతో ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి వెళ్లడం ఖరారైంది. ఈనెలలోనే అంటే మార్చి 15 న అధికారికంగా ఈ సినిమా ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఏప్రిల్ నుండి జరుగనుంది. ఇక ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయనున్నారు.