
నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించిన నేపథ్యంలో యావత్ భారతదేశం ఉప్పొంగిపోతోంది. ఒక తెలుగు చిత్రానికి అందునా నాటు నాటు అనే పాట ఆస్కార్ సాధించడంతో భారతీయులు అందునా తెలుగువాళ్లు సంతోషంతో గర్వపడుతున్నారు. తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచడంతో ఆ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే నాటు నాటు సాంగ్ ఎంతగా ఊపేసిందో అందరికీ తెలిసిందే.
అయితే నాటు నాటు పాట ఎలా పుట్టిందో తెలుసా …….. తెరమీద ఈ పాట కనిపించేది 5 నిమిషాల లోపే ……. కానీ ఈ పాట ఇంత అద్భుతంగా రావడానికి దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి , సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి , పాట రచయిత చంద్రబోస్ , హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , అలాగే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తో పాటుగా వందలాది మంది శ్రమించారు.
ఈ పాట అద్భుతంగా రావడానికి ఏడాదికి పైగా సమయం పట్టిందంటే నమ్ముతారా ? ఎందుకంటే నాటు నాటు సాంగ్ ను చంద్రబోస్ దాదాపు 50 వెర్షన్ లు రాశారట. ఒక్కో వెర్షన్ రాస్తుంటే మళ్ళీ మళ్ళీ ఇది మార్చు , అది మార్చు ….. ఆ లైన్ లో అలా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అంటూ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి , సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి చంద్రబోస్ ను ఇబ్బంది పెట్టారట.
అలాగే కీరవాణి కూడా ఈ పాటకు ఒక్క ట్యూన్ కాదు ఏకంగా 60 కి పైగా ట్యూన్ లలో పాట రికార్డ్ చేసేలా ప్రయత్నాలు చేసాడట. చివరకు ఇప్పుడు మనం వింటున్న పాట ఫైనల్ అయ్యింది. సింగర్లు రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ చేత కూడా పలుమార్లు ఈ పాట పాడించారట కీరవాణి.
అంతేనా ……. ఈ పాటను ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. ఒక్క పాట కోసం ఏకంగా 17 రోజుల పాటు చిత్రీకరించడం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. రాజీలేని మనస్తత్వం రాజమౌళి సొంతం దాంతో ఎంతటి స్టార్ హీరోలైనా సరే …… రాజమౌళి ముందు తలవంచాల్సిందే. ఒళ్ళు నొప్పులు , కాళ్ళ నొప్పులు అంటూ చెప్పాల్సిన పరిస్థితే ఉండదు. హీరోలు ఎన్టీఆర్ , చరణ్ లు ఈ పాటను అద్భుతంగా రక్తికట్టించారు. ఇలా ఎవరి కష్టాన్ని చూసుకున్నా కూడా ఈ పాటకు ఆస్కార్ అవార్డు రావాల్సిందే అని చెప్పకతప్పదు. ఈ పాటను రాజమౌళితో పాటుగా ఆయన తనయుడు కార్తికేయ సెకండ్ యూనిట్ కు డైరెక్టర్ గా వ్యవహరించాడు అలాగే ఈ పాటకు హీరోలు , డ్యాన్సర్లు వాడిన కాస్ట్యూమ్స్ కు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించింది రాజమౌళి భార్య రామా రాజమౌళి కావడం విశేషం.