మహానటులు ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలో వి. రామచంద్రరావు దర్శకత్వంలో అట్లూరి శేషగిరి రావు నిర్మించిన చిత్రం ” పాపం పసివాడు ”. 1972 సెప్టెంబర్ 29 న విడుదలైన ఆ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. పాపం పసివాడు విడుదలై నేటికి 50 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినిమాలు అంటే ఎక్కువగా హీరో ప్రధాన పాత్రలతో సినిమా సాగేది కానీ అడపా దడపా ఇలాంటి పసివాళ్లు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రాలు కూడా వచ్చాయి.
అయితే ఇలా వచ్చిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ కాలేదు కానీ పాపం పసివాడు మాత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా బహుళ జనాదరణ పొందాయి. ” అయ్యో పాపం పసివాడా ” , ” అమ్మా నిను చూడాలి ” , ”ఓ బాబూ మా బాబు ” , ” మంచి అన్నదే కానరాదురా ” అనే పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి.
ఎస్వీ రంగారావు , దేవిక , రాజబాబు , కైకాల సత్యనారాయణ , మాస్టర్ రాము , ప్రభాకర్ రెడ్డి , నగేష్ , నాగయ్య , త్యాగరాజు , సూర్యకాంతం , ఛాయాదేవి , నాగశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గొల్లపూడి మారుతీరావు రచన అందించారు. పేరుకు మహానటులు అందరూ ఈ చిత్రంలో ఉన్నప్పటికీ అందరివీ అతిథి పాత్రలే అని చెప్పాలి. ఎందుకంటే మాస్టర్ రాము కీలకంగా ఈ సినిమా సాగుతుంది. ఆ బాలుడి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. పాపం పసివాడు చిత్రంలో మాస్టర్ రాము పడిన కష్టాలు చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యారు ప్రేక్షకులు.