జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. కాగా ఆ పర్యటనలో ఒక అభిమాని మరణించగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వాళ్ళను ధర్మపురి ఆసుపత్రికి తరలించారు. దాంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. జనసేన రథం అయిన వారాహికి పూజలు చేయించడానికి నిన్న కొండగట్టుకు చేరుకున్నాడు పవన్. అక్కడ కొండగట్టు అంజన్న సన్నిధిలో వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకున్నాడు.
తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ వాహనాన్ని పెద్ద సంఖ్యలో ఫాలో అయ్యారు అభిమానులు , జన సైనికులు. అయితే పెద్ద ర్యాలీ కావడంతో బైక్ ల మీద వస్తున్న వాళ్ళు ఒకరికొకరు ఢీకొట్టడంతో ఒక అభిమాని మరణించగా ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట వద్ద జరిగింది.
అయితే ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి ఆలస్యంగా వెళ్ళింది. ఇప్పటి వరకైతే జనసేన తరుపున ఎలాంటి ప్రకటన రాలేదు కానీ అభిమాని కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఆదుకుంటాడని భావిస్తున్నారు. తమ అభిమాన హీరోను చూడాలని సంతోషపడిన వాళ్లలో ఒకరు మరణించగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.