డార్లింగ్ ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం టీజర్ ఇటీవలే విడుదల అయ్యింది. ఇక అప్పటి నుండి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై పలు విమర్శలు రాగా తాజాగా ” వానరసేన స్టూడియోస్ ” అనే యానిమేషన్ సంస్థ ఆదిపురుష్ చిత్రంపై తీవ్ర ఆరోపణలు చేసింది.
ప్రభాస్ లుక్ ని మా నుండి కాపీ కొట్టారని , దీనికి మాకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకుండా వాడుకోవడం దారుణమంటూ టి సిరీస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కావాలంటే మా సంస్థ రూపొందించిన కళాకృతి చూడండి అంటూ ఓ విజువల్ ని సోషల్ మీడియాలో వదిలింది. తమ విజువల్ మాత్రమే కాదు ప్రభాస్ లుక్ ని కూడా వదిలింది ఆ సంస్థ.
రెండు పోస్టర్ లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా ఆదిపురుష్ నిర్మాణ సంస్థని కూడా ట్యాగ్ చేసారు. ఇంకేముంది రచ్చ రచ్చ అవుతోంది. ఇప్పటికే టీజర్ యానిమేటెడ్ ఫిలిం గా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ లుక్ మా నుండి కాపీ కొట్టారంటూ వానరసేన అనే సంస్థ ఆరోపించడంతో మరింతగా వివాదం అవుతోంది. మొత్తానికి ఆదిపురుష్ చిత్రాన్ని చాలా వివాదాలే చుట్టుముడుతున్నాయి.