డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” ప్రాజెక్ట్ – K ”. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ , స్వప్న లు నిర్మిస్తున్న ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్లకు పైగానే . భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి పలువురు బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఇక నైజాం లో కూడా విపరీతమైన పోటీ నెలకొంది.
దాంతో ఏషియన్ సునీల్ నారంగ్ ఏకంగా 70 కోట్ల ఆఫర్ తో ప్రాజెక్ట్ – K నైజాం రైట్స్ సొంతం చేసుకున్నాడు. నైజాం లో ఏషియన్ వాళ్లకు పెద్ద ఎత్తున థియేటర్లు ఉన్న విషయం తెలిసిందే. దానికి ప్రభాస్ సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉండటంతో పాటుగా వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న సినిమా మహానటి వంటి క్లాసికల్ హిట్ ను అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ భారీ మొత్తాన్ని ఇచ్చి నైజాం హక్కులు తీసుకున్నారు ఏషియన్ సునీల్.
టైం మిషన్ లాంటి కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ నటిస్తోంది. ఇక కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నాడు. 2024 లో ప్రాజెక్ట్ – K చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కావడానికి ఏడాదికి పైగా సమయం ఉంది అయినా పోటీపడి హక్కులు పొందారు.