
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సంచలన చిత్రం ” పుష్ప 2 ” the rule. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన పుష్ప 2 గ్లిమ్ప్స్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తోంది. అన్ని భాషల్లో కలుపుకొని 70 మిలియన్ లకు పైగా వ్యూస్ ని సాధించి ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా నిలిచింది. పోలీసుల నుండి తప్పించుకున్న పుష్ప అంటూ విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టిస్తోంది.
2021 లో విడుదలైన పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా చిత్రంగా వసూళ్ల వర్షం కురిపించింది. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా ఉండబోతోంది అని తాజా వీడియో ద్వారా నిరూపించాడు దర్శకుడు సుకుమార్. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్ , అనసూయ తదితరులు నటిస్తున్నారు.
పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తయ్యింది. పాటలన్నీ బాగా వచ్చాయని తెలుస్తోంది. పుష్ప 2 గ్లిమ్ప్స్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉండటంతో అల్లు అర్జున్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే రీతిలో సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. షారుఖ్ ఖాన్ పఠాన్ టీజర్ 24 గంటల్లో 29 మిలియన్ల వ్యూస్ తో సంచలనం సృష్టించగా ఆ రికార్డ్ ను బద్దలు కొట్టాడు అల్లు అర్జున్. 70 మిలియన్ లకు పైగా వ్యూస్ తో దూసుకుపోతున్న పుష్ప 2 గ్లిమ్ప్స్ అవలీలగా 100 మిలియన్ వ్యూస్ తో సరికొత్త రికార్డ్ ని సెట్ చేసి పెట్టడం ఖాయమని భావిస్తున్నారు.






