మహానటులు నందమూరి తారకరామారావు , సావిత్రి అన్నా – చెల్లెలు గా నటించిన చిత్రం రక్తసంబంధం. 1962 నవంబర్ 1 న ఈ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ , సావిత్రి ల నటనకు ప్రేక్షకులు మంగళ హారతులు పట్టారు. ఇక అప్పట్లో ఈ సినిమా చూస్తూ దాదాపుగా ప్రేక్షకులంతా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారంటే అతిశయోక్తి కాదు సుమా ! ఎన్టీఆర్ , సావిత్రి నటన చూసి కన్నీళ్ల పర్యంతమయ్యారు ప్రేక్షకులు.
వి. మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డూండీ , సుందర్ లాల్ నహతా సంయుక్తంగా నిర్మించారు. ఎన్టీఆర్ , సావిత్రి జంటగా నటించిన గుండమ్మకథ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆ సినిమా విడుదలైన కొద్ది రోజులకే రక్తసంబంధం చిత్రం విడుదల కావడం విశేషం. ఎందుకంటే …… గుండమ్మకథ చిత్రంలో ఎన్టీఆర్ , సావిత్రి జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు. అందుకు విరుద్ధంగా రక్తసంబంధం చిత్రంలో మాత్రం అన్నా చెల్లెలు గా నటించి మెప్పించడం అంటే మాటలు కాదు కదా……
నిజమైన అన్నా చెల్లెలు ఎన్టీఆర్ , సావిత్రి లాగే ఉండాలని భావించారంటే వాళ్ళు ఎంతగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో కాంతారావు, దేవిక , రేలంగి , సూర్యకాంతం , రమణారెడ్డి , గిరిజ , ప్రభాకర్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఘంటసాల సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. సరిగ్గా 60 సంవత్సరాల క్రితం ఇదే రోజున విడుదలై సంచలన విజయం సాధించింది రక్తసంబంధం చిత్రం. అన్నా చెల్లెలు సెంటిమెంట్ చిత్రం అంటే ముందుగా గుర్తుకొచ్చే చిత్రం రక్తసంబంధం అనడంలో ఎలాంటి సందేహం లేదు.