
నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం
సంగీతం : ఇళయరాజా
నిర్మాతలు : కాలిపు మధు – వెంకట్ రెడ్డి
దర్శకత్వం : కృష్ణవంశీ
విడుదల తేదీ : మార్చి 22 , 2023
రేటింగ్ : 3.5 / 5
క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుగాంచిన కృష్ణవంశీ చాలాకాలంగా సరైన సినిమా లేక సతమతమౌతున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వం వహించిన చిత్రం ” రంగమార్తాండ ”. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ చిత్రాన్ని తెలుగులో ” రంగమార్తాండ ” గా రీమేక్ చేసాడు. ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రం మార్చి 22 న ఉగాది కానుకగా విడుదల అవుతోంది. అయితే పలువురు సినీ ప్రముఖులకు అలాగే మీడియాకు ముందుగానే ప్రీమియర్ షోలు వేసాడు. ఆ ప్రీమియర్ షోల ప్రకారం రంగమార్తాండ ఎలా ఉందో తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.
కథ :
రంగస్థల కళాకారుడు రాఘవరావు ( ప్రకాష్ రాజ్ ) తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటాడు. రాఘవరావు నటనను మెచ్చిన అభిమానులు రంగమార్తాండ బిరుదుతో సత్కరిస్తారు. అయితే అనూహ్యంగా ఆ వేదికపై రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టిస్తాడు. తన ఆస్తిని కొడుకు ,కూతురు లకు పంచి ఇస్తాడు. హాయిగా శేష జీవితాన్ని భార్య ( రమ్యకృష్ణ ) తో గడపాలని అనుకుంటాడు.
అయితే అనూహ్యంగా రాఘవరావు జీవితంలో అనుకోని మలుపులు చోటు చేసుకుంటాయి. దాంతో రాఘవరావు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు , అతడి జీవితం చివరకు ఏమైంది ? అన్నది తెలియాలంటే రంగమార్తాండ చిత్రాన్ని చూడాల్సిందే.
హైలెట్స్ :
ప్రకాష్ రాజ్
రమ్యకృష్ణ
బ్రహ్మానందం
నటీనటుల ప్రతిభ :
రంగమార్తాండ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడు ప్రకాష్ రాజ్. ఈ నటుడి గురించి కొత్తగా చెప్పేదేముంది అద్భుతమైన నటుడు. సాధారణ పాత్రను కూడా అవలీలగా అసాధారణ పాత్రగా మలిచే గొప్ప నటుడు …… అలాంటిది అసాధారణ పాత్ర లభిస్తే ఇక దాన్ని ఎంతగా రక్తి కట్టిస్తాడో మరోసారి చాటి చెప్పాడు ప్రకాష్ రాజ్. అతడి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటే అతిశయోక్తి కాదు సుమా ! అలాగే బ్రహ్మానందం అంటే నవ్వుల రారాజుగా ముద్ర పడింది. కానీ బ్రహ్మానందం అన్ని రకాల పాత్రలను అవలీలగా చేయగలడు. ఆ విషయాన్ని రంగమార్తాండ చిత్రంతో రుజువు చేసాడు. బ్రహ్మానందం ను మరో కోణంలో చూపించి మెప్పించాడు కృష్ణవంశీ. ఇక రమ్యకృష్ణ కూడా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగిలిన పాత్రల్లో అనసూయ , శివాత్మిక రాజశేఖర్ , ఆదర్శ్ బాలకృష్ణ , రాహుల్ సిప్లిగంజ్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం :
మొదటగా కృష్ణవంశీ గురించి చెప్పుకోవాలి. గత ఆరేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న కృష్ణవంశీ మరాఠీ చిత్రాన్ని రీమేక్ కోసం ఎంచుకోవడం కత్తిమీద సాము అనే చెప్పాలి. ఆయా పాత్రలకు తగ్గట్లుగా నటీనటులను ఎంచుకొని అద్భుతమైన నటన రాబట్టుకున్నాడు. ప్రేక్షకుల గుండెల్ని పిండేసాడు. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక ఇళయరాజా అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
ఓవరాల్ గా : తప్పకుండా చూడాల్సిన సినిమా.