సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాబా చిత్రాన్ని మళ్ళీ విడుదల చేయడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. బాబా చిత్రం రజనీకాంత్ కు చాలా చాలా ఇష్టమైన సినిమా. పైగా ఈ చిత్రానికి కథ , కథనం అందించాడు కూడా దాంతో బాబా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావించాడు.
సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్లాప్ కావడంతో రజనీకాంత్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ బాబా చిత్రాన్ని మళ్ళీ విడుదల చేయాలనే ఆలోచన వచ్చిందట రజనీకాంత్ కు అలాగే దర్శకులు సురేష్ కృష్ణకు. దాంతో ఇద్దరూ కూర్చొని కథలో ఇంకా ఏమైనా మార్పులు చేయొచ్చో ఆలోచించి స్వల్ప మార్పులు చేసారు.
అంతేకాదు కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసారు. రీ షూట్ చేసిన సన్నివేశాలకు తాజాగా రజనీకాంత్ డబ్బింగ్ చెప్పాడు. ఇంకేముంది రజనీకాంత్ బాబా చిత్రానికి డబ్బింగ్ చెప్పిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదట బాబా చిత్రాన్ని తమిళంలో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు కానీ రజనీకాంత్ కున్న క్రేజ్ దృష్ట్యా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
రజనీకాంత్ సరసన బాలీవుడ్ భామ మనీషా కోయిరాలా నటించింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. తాజాగా రీ షూట్ చేసిన సన్నివేశాలకు రెహమాన్ నేపథ్య సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది బాబా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇది రజనీకాంత్ అభిమానులకు సంతోషకరమైన వార్త అనే చెప్పాలి.