ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రచారం కోసం 80 కోట్లు ఖర్చు పెట్టారని చెబుతున్నావ్ …… నీదగ్గర లెక్కలు ఉన్నాయా ? అంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. ఆస్కార్ అవార్డులో పోటీ కోసం ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ 80 కోట్లు ఖర్చు పెట్టారని , ఆ 80 కోట్లతో నేను 8 , 10 సినిమాలు తీసి మీ మోహన కొట్టేవాడ్ని అంటూ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
అయితే తమ్మారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై అటు ఎన్టీఆర్ అభిమానులు ఇటు చరణ్ అభిమానులు అలాగే నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగడంతో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా రంగంలోకి దిగాడు. తమ్మారెడ్డి పై నిప్పులు చెరిగాడు.
ఆస్కార్ బరిలో తెలుగు సినిమా నిలిచినందుకు గర్వపడాలి కానీ ఇలా విమర్శలు చేస్తావా ? జేమ్స్ కామెరూన్ , స్పీల్ బర్గ్ లాంటి వారు డబ్బులు తీస్కొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశ్యమా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ విషయంలో నెటిజన్లు తమ్మారెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ ఆర్ ఆర్ నాటు నాటు సాంగ్ తో చరిత్ర సృష్టించాలని , భారత కీర్తి పతాక ఎగురవేయాలని భావిస్తున్నారు.