
ఆర్ ఆర్ ఆర్ చిత్రం లోని నాటు నాటు పాటకు ఆస్కార్ లభించడంతో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందులో నటించిన హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో పాటుగా పాట రాసిన చంద్రబోస్ సంగీతం అందించిన కీరవాణి , పాడిన కాలభైరవ , రాహుల్ సిప్లిగంజ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇలా అందరి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ పాట తెరమీద అందంగా రావడానికి హీరోల చేత ఇలా డ్యాన్స్ చేయించడానికి కారకులు ఎవరో తెలుసా …… కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్.
అవును నాటు నాటు పాటకు డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. హీరోలు ఎన్టీఆర్ , రాంచరణ్ ల చేత ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేయించడానికి కారకుడు ప్రేమ్ రక్షిత్. అయితే ఈరోజు ఇంతటి స్థాయి అందుకున్న ప్రేమ్ రక్షిత్ ఒకప్పుడు 50 వేల రూపాయల కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు తెలుసా ……
1993 లో ప్రేమ్ రక్షిత్ కుటుంబాన్ని తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు వెంటాడాయి. ఆ సమయంలో ఆ ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. అయితే ఆత్మహత్య చేసుకోవాలని అతడు అనుకుంటే సరిపోదుగా ఆ దేవుడి నిర్ణయం కూడా ఉండాలి. ప్రేమ్ రక్షిత్ ఒకలా తలిస్తే ఆ దేవుడు మరోలా తలిచాడు దాంతో ఆత్మహత్య చేసుకోవాలని చెన్నై బీచ్ కు వెళ్లిన వాడల్లా తిరిగి ఇంటికి వచ్చాడు.
అంతే …… ఇంటికి రాగానే డ్యాన్స్ మాస్టర్ గా పనిచేయాలని ఒక సినిమా ఆఫర్ వచ్చిందట. దాంతో తన ఆత్మహత్య నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. కట్ చేస్తే వరుసగా సినిమా ఆఫర్లు తలుపు తట్టాయి. దాంతో బిజీగా మారిపోయాడు. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్న పాటకు డ్యాన్స్ మాస్టర్ అయ్యాడు. విధి లిఖితం అంటే ఇదే !