
అల్లూరి సీతారామరాజుగా చరణ్ కొమరం భీం గా ఎన్టీఆర్ నటించిన సంచలన చిత్రం ” RRR ” . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. గత ఏడాది 2022 మార్చి 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యింది RRR. భారీ అంచనాల మధ్య విడుదల కావడంతో భారీ ఓపెనింగ్స్ సాధించింది.
ఎన్టీఆర్ , చరణ్ ఇద్దరు కూడా మాస్ హీరోలు కావడం వాళ్లకు ఓటమి ఎరుగని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తోడవ్వడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ ను కుమ్మేసి 1200 కోట్లకు పైగా వసూళ్ల ను సాధించింది. ఎన్టీఆర్ , చరణ్ ల అభినయానికి తోడు ఎం ఎం కీరవాణి అందించిన పాటలు , నేపథ్య సంగీతం , రాజమౌళి దర్శకత్వ ప్రతిభ వెరసి ఆర్ ఆర్ ఆర్ ను భారీ విజయం వరించింది.
ఇక ఈ చిత్రంలో సుద్దాల అశోక్ తేజ రచించిన ” కొమురం భీముడో ….. ” అనే పాట ఎన్టీఆర్ లోని నటనను మరింతగా వెలికి తీసింది. ఈపాటలో ఎన్టీఆర్ అభినయానికి యావత్ ప్రేక్షక లోక ఫిదా అయ్యింది. అదే సమయంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించి ఔరా అనిపించాడు. ఇక చంద్రబోస్ రాసిన నాటు నాటు అనే పాట ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. కట్ చేస్తే ఆ పాటను ఆస్కార్ కూడా వరించింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏ నోట విన్నా నాటు నాటు పాటే !
అసలు పాట అంటే అంతగా తెలియని వాళ్ళు కూడా నాటు నాటు అంటూ ఊగిపోతున్నారంటే ఈ పాట ఎంతగా ప్రభావం చూపించిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా విడుదలై సరిగ్గా నేటికి ఏడాది దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ , చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పలు చోట్ల స్పెషల్ షోలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.