
ఒక్క హీరోను చూస్తేనే అభిమానులు పులకించిపోతారు అలాంటిది ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు వెండితెర మీద కనిపిస్తే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా ? మాస్ జాతరే ! ఇప్పుడు యూట్యూబ్ లో అదే జరుగుతోంది. విక్టరీ వెంకటేష్ , బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లకు తోడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ ” ఏంటమ్మ …….. ఏంటమ్మ ” అనే పాటలో కలిసి స్టెప్పులు వేశారు. ఈ ముగ్గురు కూడా మాస్ హీరోలు అందునా పచ్చ చొక్కా వేసి లుంగీ కట్టి దాన్ని పైకి ఎగదోసి మరీ డ్యాన్స్ చేస్తే ఇక ఆ విజువల్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఊహించుకోండి.
తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ” కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ”. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో రాంచరణ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు. దాంతో సల్మాన్ ఖాన్ , వెంకటేష్ , చరణ్ లపై ఈ పాటను చిత్రీకరించారు.
చరణ్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచమే ఫిదా అవుతోంది. దాంతో ఇద్దరు లెజెండ్స్ సల్మాన్ , వెంకీ లతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందంటూ పేర్కొన్నాడు. ఈ సినిమాలోనే తెలంగాణ బతుకమ్మ పాట కూడా పెట్టారు. అది కూడా తెలుగులోనే ఈ పాట ఉండటం విశేషం. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఇలా ప్రమోషన్స్ మొదలు పెట్టారన్న మాట.






