
సమంత శకుంతల గా నటించిన శాకుంతలం సినిమా రివ్యూ కూడా వచ్చేసింది. ఒకవైపు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. అలాగే అదే సమయంలో శాకుంతలం రివ్యూ కూడా వచ్చేసింది. అదేంటి ? అదెలా సాధ్యం …… సినిమా ఏప్రిల్ 14 న విడుదల అవుతోంది కదా ! అని అనుకుంటున్నారా ? సినిమా ఏప్రిల్ 14 నే విడుదల కానీ కొంతమందిని సెలెక్ట్ చేసి హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో లార్జ్ స్క్రీన్ లో ఈ సినిమాను ప్రదర్శించారు.
ఇక సినిమా చూసిన వాళ్ళు ఊరుకుంటారా రివ్యూ ఇచ్చేస్తున్నారు. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం శాకుంతలం సినిమా బాగుంది. అయితే రివ్యూ ఇచ్చేవాళ్ళు మాత్రం రకరకాలుగా ఇస్తున్నారు. బాగుంది కానీ అద్భుతమైన సినిమా అయితే కాదని , సమంత కోసం ఓసారి చూడొచ్చని , పెద్ద పెద్ద నటీనటులు ఉన్నప్పటికీ వాళ్లకు నటించే అవకాశం పెద్దగా లభించలేదని ఓవరాల్ గా మూవీ ఓకే అని అంటున్నారు.
మొత్తానికి శాకుంతలం సినిమాతో సమంత హిట్ మాత్రం అందుకోబోతోంది అని చెప్పొచ్చు. అయితే అది ఏ స్థాయి హిట్ అన్నది మాత్రం ఈనెల 14 తర్వాత తేలనుంది. నెగెటివ్ టాక్ లేదు కాబట్టి సినిమాకు అదొక ప్లస్. అలాగే సినిమా నిడివి కూడా 2 గంటల 20 నిముషాలు మాత్రమే ! అది కూడా సినిమాకు కలిసి వచ్చే అంశం.
సమంత , మోహన్ బాబు , శరద్ కేల్కర్ , మధుబాల , దేవ్ మోహన్ , అదితి బాలన్ , అనన్య నాగళ్ళ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ భరతుడిగా నటించడం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం.






