భారీ చిత్రాలు ఎలాగూ భారీ విజయాలు సాధిస్తాయి లేదంటే భారీ నష్టాలను చవిచూస్తాయి. కానీ చిన్న చిత్రాలు అడపా దడపా సంచలనాలు నమోదు చేస్తూనే ఉన్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన చాలా చిత్రాలు వండర్ క్రియేట్ చేసాయి. అలా ఈ ఏడాది వండర్ క్రియేట్ చేసిన చిత్రాల్లో కార్తికేయ 2 , బింబిసార , సీతారామం చిత్రాలు ఉన్నాయి.
కార్తీకేయ 2 :
నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” కార్తికేయ 2”. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం కేవలం 30కోట్ల బడ్జెట్ తోనే రూపొందింది. కార్తికేయ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా వచ్చింది కార్తికేయ 2. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ కు చేరుకుంది. అన్ని భాషల్లో రిలీజ్ అయి 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.
బింబిసార :
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించాడు. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా , నిర్మాతగా పలు ప్రయత్నాలు చేస్తున్నాడు….. కిందామీదా పడుతున్నాడు కానీ స్టార్ డం పొందలేకపోయాడు. అడపా దడపా హిట్స్ కొడుతూనే ఉన్నాడు కానీ సాలిడ్ గా స్టార్ డం అందుకోలేకపోయాడు. సరిగ్గా అలాంటి సమయంలో వచ్చిన ఈ బింబిసార అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ విజయాన్ని అందుకుంది. దాదాపు 70 కోట్ల వసూళ్లను సాధించి ట్రేడ్ విశ్లేషకులను షాక్ అయ్యేలా చేసింది.
సీతారామం :
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్లాప్ చిత్రాల దర్శకుడిగా పేరున్న హను రాఘవపూడి దర్శకుడు. దాంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. అయితే టీజర్ , ట్రైలర్ సీతారామం ప్రామిసింగ్ గా ఉండటంతో కాస్త ఓపెనింగ్స్ లభించాయి. అలా మార్నింగ్ షో పూర్తి అవ్వడమే ఆలస్యం ఇలా అంచనాలు పెరిగిపోయాయి. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. దాంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది సీతారామం. 30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఓవరాల్ గా 100 కోట్ల మార్క్ ను అందుకుంది.