తెలుగుతెరపై చెరగని ముద్ర వేశారు బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ. 1942 మే 31 న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి. అయితే సినిమాల్లోకి ”కృష్ణ ” గా ప్రవేశించారు. తేనెమనుసులు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కృష్ణ. హీరోగా అవకాశాల కోసం కష్టాలు పడినప్పటికీ అచిరకాలంలోనే మంచి అవకాశాలతో పాటుగా తిరుగులేని విజయాలను అందుకున్నారు.
మొదట్లో తన నటన పట్ల కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ఆ విమర్శలనే సోపానాలుగా చేసుకొని అప్రతిహతంగా విజయాలను అందుకున్నారు. హీరోగానే కాకుండా నిర్మాతగా , దర్శకుడిగా , ఎడిటర్ గా , స్టూడియో అధినేతగా సంచలన విజయాలు సాధించారు. తెలుగుతెరపై సాహసాలకు మారుపేరుగా నిలిచారు కృష్ణ. తొలి స్కోప్ , తొలి కలర్ , తొలి ఈస్ట్ మన్ కలర్ , తొలి డీటీఎస్ , తొలి సినిమా స్కోప్ ఇలా టెక్నాలజీని తెలుగు సినిమాకు అందించిన మహనీయుడు కృష్ణ.
పద్మాలయా స్టూడియోస్ అనే బ్యానర్ స్ధాపంచి ఆ బ్యానర్ పై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. అంతేకాదు ఎన్టీఆర్ తో పోటీ పడి ఆయన ఎన్ని రంగాల్లో అడుగుపెట్టి విజయం సాధించారో అన్ని రంగాల్లో కూడా ప్రవేశించి విజయాలు అందుకున్నారు కృష్ణ. ఎన్టీఆర్ కూడా హీరోగా , నిర్మాతగా , దర్శకుడిగా , రాజకీయ నాయకుడిగా విజయాలు సాధించారు. ఇక కృష్ణ కూడా ఎన్టీఆర్ తో పోటీ పడి అన్ని రంగాల్లో విజయాలు అందుకున్నారు. కాకపోతే ఎన్టీఆర్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కాగా కృష్ణ మాత్రం లోక్ సభకు పోటీ చేసి ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత ఓటమి చవి చూడటంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.