
వచ్చే ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తానని అలాగే ఎన్టీఆర్ కూడా ప్రచారానికి వస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరోనందమూరి తారకరత్న. నందమూరి మోహనకృష్ణ తనయుడైన తారకరత్న హీరోగా టాలీవుడ్ లో అరంగేట్రం చేసాడు. అయితే హీరోగా ఎన్ని సినిమాల్లో నటించినా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు.
దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఇక నటుడిగా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాడు. అయినప్పటికీ నందమూరి బ్రాండ్ ఉన్న వ్యక్తి కావడంతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా మారాలనే ఆలోచనలో ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తానని అంటున్నాడు.
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని , జగన్ రాక్షస పాలనకు చరమగీతం పలకడానికి నా సర్వశక్తులు ఒడ్డి పోరాడతానని , ఇక భవిష్యత్ తరాల కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేస్తాడని అంటున్నాడు తారకరత్న. మరి ఎన్టీఆర్ ఆలోచన ఎలా ఉందో ! ఏపీలో 2024 లో శాసనసభకు ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు రావడానికి నందమూరి కుటుంబం మళ్ళీ ఒక్కటౌతుందని అంటున్నాడు.