
మహానటుడు నందమూరి తారకరామారావు , మహానటి భానుమతి , నందమూరి బాలకృష్ణ తదితరులు కలిసి నటించిన సంచలన చిత్రం తాతమ్మ కల. ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మొట్టమొదటి సరిగా రామకృష్ణా స్టూడియోస్ పతాకంపై ఎన్టీఆర్ నిర్మించడం విశేషం. కుటుంబ నియంత్రణ చట్టం రూపొందించిన సమయంలో ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారు ఎన్టీఆర్.
డాక్టర్ భానుమతి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంతోనే నందమూరి బాలకృష్ణ హీరోగా పరిచయం అయ్యారు. బాలయ్య బాల నటుడిగా నటించిన చిత్రం ఈ తాతమ్మ కల. పలువురు సీనియర్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం విశేషం. అయితే ఈ సినిమా 1974 లో ఒకసారి విడుదలై అర్ధ శతదినోత్సవం జరుపుకుంది. అలాగే 1975 లో మరోసారి విడుదలై అప్పుడు కూడా 50 రోజులకు పైగా ప్రదర్శితం కావడం విశేషం.
తాతమ్మ కల చిత్రం రెండుసార్లు సెన్సార్ జరుపుకుంది. ఎందుకంటే కుటుంబ నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు చాలు అని తెగ ప్రచారం చేసింది భారత ప్రభుత్వం. దాంతో ఎన్టీఆర్ ఆ చట్టం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అందుకే కొన్ని అంశాలు ఇందులో చొప్పించారు.
కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేసే డైలాగ్స్ ఉండటంతో సెన్సార్ పరంగా ఇబ్బందులు వచ్చాయి. దాంతో మొదట 1974 ఆగస్టు 30 న ఒకసారి విడుదల చేయగా 50 రోజులకు పైగా ప్రదర్శితమైంది. అయితే ఆ తర్వాత మరికొన్ని సన్నివేశాలను జత చేస్తూ మరొకసారి సెన్సార్ చేయించి 1975 జనవరి 8 న విడుదల చేశారు. విశేషం ఏంటంటే 5 నెలల కాలంలోనే రెండుసార్లు తాతమ్మ కల విడుదల అవడం రెండుసార్లు కూడా 50 రోజులకు పైగా ప్రదర్శించబడటం విశేషం. ఇంతటి గొప్ప చరిత్ర కేవలం తాతమ్మ కల చిత్రానికి మాత్రమే దక్కింది. పలు చిత్రాలు మళ్లీ మళ్లీ విడుదల అయ్యాయి అలాగే మంచి విజయం సాధించాయి కానీ ఒకే సినిమా రెండుసార్లు సెన్సార్ కావడం , రెండుసార్లు కూడా అయిదు నెలల కాలంలోనే విడుదల కావడం …… రెండుసార్లు కూడా అర్ధ శతదినోత్సవం జరుపుకోవడం గొప్ప విషయమే మరి. అలాంటి అరుదైన ఘనత సొంతం చేసుకుంది తాతమ్మ కల.