Venu director తెలుగు రాష్ర్టాల్లో జబర్దస్త్ వేణు అంటే తెలియని వారుండరు.. తన స్కిట్ల ద్వారా ఎంతో మందిని నవ్వించారు. కానీ ఆయన రూట్ ఇప్పుడు మారిపోయింది. కమెడీయన్ వేణు కాస్త ఇప్పుడు డైరెక్టర్ వేణుగా మారిపోయాడు. ఎన్నో అంతర్జాతీయ , జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న సినిమాను తీశాడు. తెలంగాణలో సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఏడిపించాడు. తెలంగాణ జీవ కథను ఒడిసి పట్టి.. చక్కగా చిత్రీకరించాడు. ప్రతి కుటుంబం ఇది మన కథ అని ఫీలయ్యేలా చేశాడు. ప్రతి గ్రామంలో తెరలు పెట్టి రోజుల తరబడి ఈ సినిమాను ప్రదర్శించారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఎంతమంచి సినిమాను వేణు అందించాడో..
జబర్దస్త్ ద్వారా ఎందరినో నవ్వించాడు వేణు. వేణు వండర్స్ పేరిట ఆయన స్కిట్స్ చాలానే ఉన్నాయి. ఇటీవల వేణు యెల్దండి తీసిన బలగం సినిమా ఆయనను ఓవర్ నైట్ ఓ పెద్ద స్టార్ ను చేసింది. డైరెక్టర్ గా మొదటి సినిమాకే 100 కు 100 మార్కులు వేయించుకున్నాడు. తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించి, సక్సెస్ అయ్యారు. అయితే ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తన కెరీర్ ప్రారంభంలో పడ్డ కష్టాలను అందరితో పంచుకున్నాడు. 1999లో తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చానని, అప్పుడు తన వద్ద కేవలం రూ. 200 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. అవకాశాల కోసం ఇండస్ర్టీలో తిరిగినట్లు తెలిపాడు. అయితే ఎప్పుడూ ఏకాగ్రత కోల్పోలేదని, సినిమా తీయాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. అయితే జబర్దస్త్ తర్వాత తనకు అవకాశాలు రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్లినట్లు చెప్పాడు.
2011లో నాన్న చనిపోతే సరైన సమయం లేక ఆచార వ్యవహారాలు పాటించలేదని చెప్పాడు. బలగం సినిమా కథ రాసుకున్నప్పుడు కూడా ఇదే గుర్తొచ్చి.. ఫ్రెండ్ తో ఆచార వ్యవహారాల గురించి చర్చించి కథ రాసినట్లు చెప్పాడు అయితే వేణు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో, ఈ ప్రాంత సంస్కృతి, ఆచార వ్యవహారాలపై పట్టు ఉండడంతో ఈ సినిమా సక్సెస్ అయ్యిందని అంతా అనుకుంటున్నారు. ఇంతవరకు ఏ ఒక్కరూ స్పృశించని కథను తను ఒడిసిపట్టాడు. అందులో సక్సెస్ అయ్యాడు. వేణు ఇప్పుడు ఒక్క సినిమాతో నే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పటికీ బలగం సినిమా విజయ యాత్రలు కొనసాగుతున్నాయి. ఇంకా ఆ సినిమా గురించే పల్లెల్లో చర్చ జరుగుతున్నది.