Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్లాఫుల కొత్తమీ కాదు. ఏడాదికి దాదాపు రెండు వందలకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఇక్కడ సక్సెస్ రేటు కనీసం ఐదు శాతం కూడా ఉండడం లేదు. ఇక షూటింగ్స్ పూర్తయ్యి, సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలు ల్యాబుల్లో మూలన పడుతున్న సినిమాలు కూడా చాలానే ఉంటున్నాయి. ఇలా ల్యాబుల్లో ఆగిపోయిన వాటిలో పెద్దహీరోల సినిమాలు సైతం ఉన్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు.
గతంలో తెలుగు సినిమా అంటే సిల్వర్ జూబ్లీ, రెండు వందల రోజలు, వంద రోజులు, సెంటర్లు, గ్రాస్ అంటూ పెద్ద పెద్ద లెక్కలుండేవి. రాను రాను తెలుగు సినిమా వైభవం మసకబారిపోతున్నది. పేరుకు భారీ బడ్జెట్, పెద్ద హీరోలు అని పైకి గొప్పలు చెప్పుకోవడమే తప్ప నిర్మాతకు ఒరుగుతున్నదేమీ లేదు. ఒకప్పటి అగ్ర నిర్మాతల ఎంఎస్ రాజు పూర్తిగా సినిమాలకే దూరమయ్యాడు. అగ్ర నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ కూడా సినిమాలు తగ్గించేసింది. మొన్నటి వరకు కొన్ని సినిమాలు డిస్ర్టిబ్యూట్ చేసినా ఇప్పుడు అవి తగ్గించేసింది. చిన్న సినిమాలు నచ్చితే వాటిని అవుట్ రైట్ గా కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నది. ఇలా చేసిన వాటిలో పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, బేబీ, లేటెస్ట్ గా 35 చిన్న కథకాదు ఉన్నాయి.
ఓటీటీల రాకతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతున్నది. దీంతో భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. పెద్ద సినిమాలు హిట్ టాక్ వచ్చినా నిర్మాతకు పెద్దగా లాభం ఉండడం లేదనేది బహిరంగ రహస్యం. ఇక నిర్మాతలు ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాకు హైప్ వస్తేనే ఓటీటీలు పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నాయి. దీంతో నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలని ప్రొడ్యూసర్లు భావిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన పెద్ద సినిమాలు తొలి ఆట నుంచే చేతులెత్తేయడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మొన్నటి వరకు హీరోల డేట్లు దొరికితే చాలు అడిగినంత రెమ్యునరేషన్ అడ్వాన్స్ గా చెల్లించి సినిమాలు చేశాడు. బడ్జెట్ పెరిగిపోయి సినిమా హిట్టయినా చేతికి రూపాయి రాకపోవడంతో పెద్ద హీరోల రెమ్యునరేషన్ లో కోత పెట్టడానికి సిద్ధమయ్యారు. హీరోలు కూడా నిర్మాతల కోసం ఓ అడుగు వెనక్కి తగ్గుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. నిర్మాణ వ్యయం తగ్గితే సినిమా ప్లాఫయినా నిర్మాత కాస్త సేఫ్ జోన్ లో ఉంటాడు. మేము అడిగినంత ఇవ్వా్ల్సిందేనని పట్టుబడితే హీరోలు ఢమాల్ అని కింద పడక తప్పదంటున్నరు సినీ విశ్లేషకులు. ఈ వైఖరి నుంచి మరికొందరు హీరోలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.