లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ……. దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నాడో మహాకవి. మహిళా లోకం కొంగు బిగిస్తే ఎలా ఉంటుందో పాట రూపంలో చెప్పాడు 50 ఏళ్ల క్రితం. ఒకప్పుడు మహిళలు ఇంటి పట్టునే ఉండేవాళ్ళు కానీ కాలం మారింది. మహిళలు వంటింటి కుందేళ్ళుగా ఉండిపోవాలనుకోవడం లేదు. రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా ప్రవేశిస్తున్నారు తమ సత్తా చాటుతున్నారు.
ఇక సినిమా రంగానికి వస్తే పలువురు మహిళలు హీరోయిన్ గా నటించడమే కాకుండా నిర్మాతగా అలాగే దర్శకురాలిగా కూడా సత్తా చాటుతున్నారు. ఆ కోవలో పలువురు హీరోయిన్ లు ఉన్నారు. హీరోయిన్ గా నటిస్తూనే దర్శకురాలిగా తమ సత్తా చాటారు. మహిళా దర్శకురాలిగా సత్తా చాటినవాళ్ల లిస్ట్ చూద్దామా !
మహానటి సావిత్రి : వెండితెరను ఏలిన మహానటి సావిత్రి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహానటిగా తెలుగు , తమిళ తెరపై చెరగని ముద్ర వేసిన సావిత్రి మూడు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించింది. చిన్నారి పాపలు , మాతృదేవత , వింత సంసారం లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించింది సావిత్రి.
విజయనిర్మల : బాలనటిగా చిత్ర రంగప్రవేశం చేసిన విజయనిర్మల దర్శకురాలిగా ప్రపంచ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన రికార్డ్ విజయనిర్మల సొంతం. విజయ నిర్మల మొత్తంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించింది. విజయనిర్మల దర్శకత్వంలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ప్రపంచంలో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన మరో మహిళ లేదు. 2002 లో గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా విజయనిర్మల వశమైంది.
జీవిత రాజశేఖర్ : పలు సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన జీవిత హీరో రాజశేఖర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత దర్శకత్వం వైపు దృష్టి మళ్లించింది. ఎవడైతే నాకేంటి , శేషు , సత్యమేవ జయతే , శేఖర్ , మహంకాళి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించింది.
నందిని రెడ్డి : అలా మొదలైంది , జబర్దస్త్ , కల్యాణ వైభోగమే , ఓ బేబీ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన నందినీ రెడ్డి ప్రస్తుతం అన్నీ మంచి శకునములే చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. అలా మొదలైంది , ఓ బేబీ లాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
సుధా కొంగర : ఆంధ్రా అందగాడు , గురు , ద్రోహి , ఆకాశమే నీ హద్దురా చిత్రాలకు దర్శకత్వం వహించిన సుధా కొంగర మహిళా దర్శకురాలిగా తనదైన ముద్ర వేసింది. ఆకాశమే నీ హద్దురా చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. పలు అవార్డులను సొంతం చేసుకుంది.
మంజుల ఘట్టమనేని : సూపర్ స్టార్ కృష్ణ వారసురాలిగా నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మంజుల ఆ తర్వాత నిర్మాతగా అలాగే దర్శకురాలిగా కూడా మారింది. అయితే నిర్మాతగా విజయం అందుకుంది కానీ దర్శకురాలిగా మాత్రం మెప్పించలేకపోయింది.