Home POLITICS ANDHRA PRADESH YS Sharmila : కాంగ్రెస్ లో షర్మిల చేరిక..ఎవరికీ నష్టం..ఎవరికీ లాభం?

YS Sharmila : కాంగ్రెస్ లో షర్మిల చేరిక..ఎవరికీ నష్టం..ఎవరికీ లాభం?

50
Sharmila
Sharmila entry into Congress

YS Sharmila : వైఎస్ఆర్ టీపీ అధినేత్రి  వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. జనవరి 4(ఎల్లుండి)న ఆ పార్టీలో చేరబోతున్నారు.  ఈమేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు జాతీయ మీడియాకు తెలియజేశాయి. 4న పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అనంతరం వరుస ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు షర్మిలకు హైకమాండ్ ఆహ్వానం కూడా పంపినట్టు సమాచారం.  కాంగ్రెస్ లో చేరికపై తాజాగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘2 రోజులు ఓపిక పట్టండి.. అన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది’’ అని చెప్పారు. ఆమె రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక ఏపీలో ఎవరికీ నష్టం..ఎవరికీ లాభం..అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాన్ని విశ్లేషిస్తే..

కాంగ్రెస్ కు ఓ ప్లాట్ ఫాం..
తెలంగాణ ఏర్పాటు, జగన్ పార్టీతో ఏపీలో కాంగ్రెస్  పూర్తిగా తుడుచుకుపెట్టుకపోయింది. అక్కడక్కడా నాయకులు తప్పా పెద్దగా క్యాడర్ లేదు. అందరూ జగన్ పార్టీలోకే వెళ్లిపోయారు. ప్రజల్లో ఊపు తెచ్చే నాయకుడు లేడు..కనీసం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందని చెప్పడానికి కూడా లేకపోయింది. అలాంటి పార్టీలోకి వైఎస్ఆర్ బిడ్డ షర్మిల చేరుతుండడంతో ఆ పార్టీకి మైలేజీ రావడం ఖాయం. ఇప్పటిదాక కాంగ్రెస్ ఏ ఒక్క చోటా కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. కానీ షర్మిల చేరికతో వైఎస్ అభిమానులు, పాత కాంగ్రెస్ అభిమానులు, వైసీపీలోని అసంతృప్తులు, ఇతర పార్టీల్లో టికెట్లు, పదవులు దొరకని వారు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంటుంది. ఒక్క అసెంబ్లీ స్థానం గెలవకున్నా..కనీసం డిపాజిట్లు దక్కే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ అప్పటి జీరో స్టేజీ నుంచి లైమ్ లైట్ లో కైతే వస్తుంది.

టీడీపీ-జనసేనపై ప్రభావం..
ఈ పార్టీలపై పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు. అయితే అన్నా చెల్లెళ్ల పోరుతో జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం వీరికి దొరకవచ్చు. షర్మిల తన అన్నపై చేసే విమర్శలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేతప్ప ఈ పార్టీల్లో నుంచి కాంగ్రెస్ లోకి ఎవరూ వెళ్లకపోవచ్చు.

ఎంతోకొంత వైసీపీపైనే..
వైఎస్ షర్మిల రాజకీయాలపైగాని, ఇతర విషయాలపై గాని వైఎస్ జగన్ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లో ఒక్కరే రాజకీయం చేయాలని, అది తాను ఎలాగూ చేస్తున్నాను కాబట్టి షర్మిలకు ఎందుకు రాజకీయాలు అన్న భావన మాత్రం లోపల ఉండిఉంటుంది. కానీ ఆయన ఏ రోజు ఆ విషయాలను బయటపెట్టలేదు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరితే.. వైసీపీ నుంచి సీటు దక్కని వారు, ఇతర అసంతృప్త నేతలు మాత్రం షర్మిల వెంట వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాను షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. ఇదే దారిలో చాలా మందే ఉండొచ్చు. కాబట్టి ఏరకంగా చూసినా జగన్ పార్టీకి కాస్త ఇబ్బంది కలగవచ్చు. కానీ భారీగా ప్రభావం చూపే అవకాశాలు లేవు.

షర్మిల పరిస్థితి ఏంటి?
కాంగ్రెస్ లో చేరడం వల్ల.. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలి హోదా.. లేదంటే జాతీయ పదవి. దీంతో కాస్త మీడియాలో కవరేజీ ఉండొచ్చు. ఒకవేళ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తే..ఆమె వరకు గెలిస్తే గెలవవచ్చు. అది కూడా ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ పోటీ చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా  రాజ్యసభ సీటులాంటిది ఇవ్వొచ్చు. వైఎస్ఆర్ టీపీతో ఏ ప్రభావం చూపకుండా డబ్బులు ఖర్చుపెట్టుకుంటూ ఉండే దానికన్నా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండడమే బెటర్ అని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

మొత్తంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరి.. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితైతే లేదు. కాకపోతే కాంగ్రెస్ కు , షర్మిలకు మీడియాలో ఇంత చోటు దొరుకుతుంది. మునపటి కన్నా కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఆ పార్టీ ఎంతోకొంత లాభపడుతుంది. కానీ షర్మిల మాత్రం జగన్, వైఎస్ అభిమానుల నుంచి దూరం కాక తప్పదు.