Home EXCLUSIVE Google News : గూగుల్‌పై భారత్‌ కన్నెర్ర.. మోదీపై జెమిని వ్యాఖ్యలకు కౌంటర్

Google News : గూగుల్‌పై భారత్‌ కన్నెర్ర.. మోదీపై జెమిని వ్యాఖ్యలకు కౌంటర్

14
Google News
Google News

Google News : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ వెనకబడింది. మైక్రోసాఫ్ట్ చాట్‌ జీపీటీకి ఫండింగ్ చేసి సంచలనం సృష్టించగా.. టెక్ దిగ్గజం గూగుల్ మాత్రం నెమ్మదిగా బార్డ్‌తో ముందుకొచ్చింది. బార్డ్ ను కాస్తా జెమినిగా మార్చింది. ఇప్పుడు జెమిని పనితీరు గూగుల్‌కు లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతోంది.

ప్రధాని మోడీ గురించి కొన్ని ప్రశ్నలకు ‘గూగుల్ జెమిని’ ఇచ్చిన సమాధానాలు భారత ప్రభుత్వం ఆగ్రహానికి కారణమైంది. ఏఐ చెప్పిన సమస్యాత్మక, చట్ట విరుద్ధమైన ప్రతి స్పందనపై గూగుల్‌కు IT మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను ఒక ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

కొన్ని చారిత్రాత్మక చిత్రాల విషయంలో ‘గూగుల్ జెమిని’ చెప్పిన సమాధానాలపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై గూగుల్ క్షమాపణ కూడా చెప్పింది. కానీ తాజాగా మరోసారి ప్రధాని మోదీ ‘ఫాసిస్ట్’ అవునా? కాదా? అని అడిగిన ప్రశ్నకు మరోసారి వివాదాస్పద సమాధానం చెప్పింది. ‘కొందరు వర్ణించిన విధానాలను మోడీ అమలు చేసినందుకు ఫాసిస్ట్ గా ఆరోపణలు ఎదుర్కొన్నారు. బీజేపీ హిందూ జాతీయవాద భావజాలం, అసమ్మతి అణిచివేత, మతపరమైన మైనారిటీల మీద హింస ఉపయోగించడమూ మరో కారణం’ అని పేర్కొంది.

అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ గురించి గూగుల్ జెమినిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు భిన్నంగా స్పందించింది. ‘వేగంగా మారుతున్న సమాచారంతో పోల్చి చూస్తే ఎన్నికలు అనేవి సంక్లిష్ట అంశం. ఖచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్‌లో శోధనను ప్రయత్నించండి’ అని సూచిస్తోంది.

ఈ వ్యవహారంపై ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ‘ఇది ఐటీ చట్టంలోని మధ్య వర్తిత్వ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని మండిపడ్డారు. గూగుల్ ఏఐ సిస్టమ్ పక్షపాతంతో సమాధానాలను అందించడం ఇది రెండో సారి అంటూ మరో సీనియర్ అధికారి తెలిపారు. షోకాజ్ నోటీస్ జారీ చేస్తున్నట్లు చెప్పారు. వారి సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే విచారణకు ఆదేశిస్తామని హెచ్చరించారు.