Home EXCLUSIVE BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

BRS-Congress : బీఆర్ఎస్ దారిలో కాంగ్రెస్

13
BRS-Congress
BRS-Congress

BRS-Congress : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని గతంలో అధికారంలో  ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఆరోపించింది. విభజన తరువాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తమ వాటాలను పంచడంలో బీజేపీ నిర్లక్ష్యం చూపుతున్నదని గులాబీ అధినేత కేసీఆర్, అప్పటి మంత్రులు మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సమానంగా అధికారంలో ఉన్నారు. రాష్ట్ర పర్యటనకు కేంద్ర మంత్రులు వచ్చిన సందర్భాల్లో గులాబీ నాయకులు పోస్టర్లు విడుదల చేస్తూ నిరసన తెలిపే సంస్కృతి కనిపించేది.

రాష్ట్రంలో ఎక్కడికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు వచ్చినా పోస్టర్లు వెలిసేవి. చివరకు మోదీ పర్యటనకు వస్తే కూడా స్వాగతం చెప్పడానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో వెళ్లలేదు. ఆ విధంగా కేసీఆర్ పరిపాలనలో బీజేపీ కేంద్ర మంత్రులకు పోస్టర్లతో నిరసన వ్యక్తంచేశారు. తెలంగాణకు ప్రధాన మంత్రి ఏమి చేశాడని కేసీఆర్ ప్రశ్నలు సంధించాడు.  తెలంగాణకు తీరని అన్యాయం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదు. నిధులు ఇవ్వడంలేదు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన దానికంటే, మనమే పన్నుల రూపంలో నిధులు ఎక్కువగా ఇస్తున్నామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించారు.

తాజాగా కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందా అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోస్టర్లు విడుదల చేసింది. దీంతో ఈ అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో  వినిపిస్తున్నాయి. వాళ్లు చేసిందే వీళ్లూ చేస్తే ఫలితం ఏముంటదనే చర్చ నడుస్తున్నది. కొత్త విధానంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటే ఎంతో కొంత ఉపయోగముంటుందని, కానీ పాత పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో అప్పటికి, ఇప్పటికి తేడా ఉండదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై పోస్టర్లు విడుదల చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలూ రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. బీజేపీ హిందూ-ముస్లిం రాజకీయం చేస్తోంది. ఈ అంశంలో ఇరుకున పెట్టే అంశాలపై కాంగ్రెస్ ఫోకస్ చేయడం లేదు. ఫలితం లేని రాజకీయ ఆలోచనలను పక్కకు పెట్టి, మేలుచేసే కొత్త ఆలోచనా విధానంతో రాజకీయంగా బీజేపీని ఎదుర్కొవడమే సరైన విధానమనే అభిప్రాయాలూ  వినిపిస్తున్నాయి.