
Power Sharing : ఏపీలో 2024 ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రజా క్షేత్రంలో బిజీ అయ్యాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టి, వారికి ఎలాంటి సహకారం అందకుండా చేయాలనే తలంపుతో ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా టీడీపీ, జనసేన పాదయాత్రలు, టూర్లను అడ్డుకుంటూ వైసీపీ నేతలు అల్లర్లకు తావిస్తున్నారనే టాక్ నడుస్తున్నది. ఈ అల్లర్లలో టీడీపీ, జనసేన నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే అవకాశమని ప్రతిపక్షాల నాయకులను ఎన్నికల వరకు జైళ్లలోనే ఉంచేలా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు.
అయితే ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ రాజకీయాలు మొత్తం వేడెక్కాయి. గతంలో లేనంతగా టీడీపీ మీద సానుభూతి పెరిగింది. అయితే జనసేన కూడా టీడీపీతో కలిసి వెళ్తామని ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, బీజేపీ కూడా కలిసి రావాలని ఆయన కోరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని ఆయన చెబుతున్నారు. అయితే టీడీపీతో పొత్తు ఖాయమని ప్రకటించిన తర్వాత ఆయన మంగళగిరి లో జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జనసేన ముఖ్య నాయకులతో పలు అంశాలపై చర్చించారు. టీడీపీతో పొత్తుకు కారణాలను కూడా ఆయన వివరించారు. ఇరు పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకెళ్లాలని, ఇగోలతో పోతే ఇబ్బందులు ఎదురవుతాయని, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి కూడా వీల్లేదని చెప్పారు.
అయితే పవన్ తాజాగా పవర్ షేరింగ్ అనే వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో జనసేన భాగమవుతుందని చెప్పకనే చెప్పారు. దీంతో పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూడా ఏదైనా వ్యాఖ్యలు చేశారా అనే అనుమానం కూడా పలువురిలో ఉంది. అయితే టీడీపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే జనసేన కేవలం మంత్రివర్గానికే పరిమితం అవుతుంది. లేదంటే జనసేన కూడా పోటాపోటీ సీట్లు గెల్చుకుంటే అధికార మార్పిడిని తెరపైకి తెస్తుంది. అయితే ఇది ఏపీ రాజకీయాల్లో అసాధ్యమనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఏపీలో వైసీపీ, టీడీపీలే ఇప్పుడు ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న పార్టీలు. ఆ స్థాయిలో జనసేన ఎదిగిందనుకోవడం అనుమానమే.
అయితే పవర్ షేరింగ్ వ్యాఖ్యలు కేవలం జనసేన శ్రేణులను సంతృప్తి పరచడంలో భాగంగానే జనసేనాని మాట్లాడారని టాక్ కూడా వినిపిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా చేయడం ద్వారా రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లోకి వెళ్తాయి. ఆ తర్వాత ఇరు పార్టీల అధనేతలు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారు. దీనిపై ఇరువురిలో ఒక స్పష్టత ఉన్నట్లు కనిపిస్తున్నది. ఒక వేళ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో జనసేన భాగస్వా్మ్యం అవడం, లేదంటే రెండున్నరేళ్ల పవర్ షేరింగ్ అడగడం పవన్ ముందున్న లక్ష్యాలు. అయితే ఆ స్థాయిలో జనసేనకు సీట్లు వస్తేనే ఇది సాధ్యమవుతుంది. మరి జనసేనాని పవర్ షేరింగ్ వ్యాఖ్యల వెనుక ఉన్న మర్మమేంటో తెలియాలంటే 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే.