26.2 C
India
Friday, July 19, 2024
More

  Sankranthi : సంక్రాంతికి సూర్యుడితో ఏం సంబంధం? ఇందులో శాస్త్రీయ కోణం తెలుసా?

  Date:

  Significance of Sankranti :

  సంక్రాంతి

  శ్లో : – యదైకరాశం పరిబుజ్య సూర్యోరాశ్యంతరం యాతినభోవిభాభే
  సంక్రాంతి సంఙ్ఞం ఖలుకాలమేన మాచక్షతే శాస్త్ర రహస్యవిఙ్ఞా :

  తా : – సూర్యుడు ఆకాశమందు ఒక రాశిని విడిచి మరియొక రాశిని చేరుకాలము సంక్రాంతి అని శాస్త్రఙ్ఞులు చెప్పిరి.
  సూర్యుడు స్థిర నక్షత్రం కదా ఒక రాశి నుంచి వేరొక రాసి లోనికి మారటమేమిటని వితండ వాదులు విపరీత ధోరణులు వెలిబుచ్చవచ్చు. సూర్యుడు స్థిరమే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ వుండటం వల్ల మనకు సూర్యోదయం ఆ రాశి వద్ద జరుగుతుంది. రోజుకు ఒక డిగ్రీ చొప్పున 30 రోజులకు ఆ రాశిని దాటి వేరొక రాశి వద్ద సూర్యోదయం జరుగుతుంది. దీనినే సంక్రమణము అన్నారు. మనకు కనపడే నక్షత్రాలను మాత్రమే పరిగణనలోనికి తీసుకొని 360 డిగ్రీల భ చక్రాన్ని 30 డిగ్రీలకు ఒక రాశి చొప్పున 12 రాశులుగ విభజించి వారికి కనపడిన ఆకృతుల పేర్లు పెట్టారు మన పూర్వ ఋషులు.

  1. క్రాంతి అంటే వెలుగు. ఆనందానికి, ఙ్ఞానానికి సంకేతం కాంతి. సూర్యుడు నిర్దిష్టమైన కాలగమనంలో సంచరిస్తూ ఒక్కొక్క రాశిలో ఒక నెల రోజులు వుండి మరియొక రాశిలోనికి ప్రవేశించటాన్ని “సంక్రమణం” అంటారు. సంక్రమణం అంటె మారటం, చేరటం అనే అర్ధాలున్నాయి.

  2. సూర్యుడు మేష రాశిలో ప్రవేశించినపుడు మేష సంక్రాంతి అని ఆ మాసం మేష మాసమని, అలాగే వృషభ రాశిలో ప్రవేశించినపుడు వృషభ సంక్రాంతని ఆ మాసాన్ని వృషభమాసమనిఈవిధంగా 12 నెలలు 12 సంక్రాంతులు ఆయామాసనామాలు ఏర్పడ్డాయి.

  3. సూర్యుడు పరంజ్యోతి. అందరికి ప్రీతిని, ప్రేరణను కలుగచేయువాడు. అతడే వృష్టికారకుడు. భూమి సూర్యుని చుట్టు తిరుగుతుండటంవలన షడృతువులేర్పడ్డాయి. ఒక వసంత సంక్రాంతి నుండి రెండవ వసంత సంక్రాంతి వరకు సంవత్సరంగా గుర్తించబడింది. వసంత, గ్రీష్మ, వర్ష ఋతువులలో సూర్యుడు విషువత్తు నుండి ( Equinox) ఉత్తరానికి ప్రయాణం చేస్తాడు. ఇది దైవ సమయం. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. దైవ సమయంలో అంటే ఉత్తరాయణంలో చేసె పనులకు శుభఫలితాలెక్కువ. సూర్యుడు మకరరాశి ప్రవేశం నుంచి కర్కాటకరాశి ప్రవేశంవరకు అంటే ఈ ఆరు నెలలు ఉత్తరాయణమని, కర్కాటకం నుంచి మళ్ళీ మకరరాశి ప్రవేశం వరకు ఉన్న ఆరు నెలలు దక్షిణాయనమని అంటారు. అయనమంటె కదలిక అనే అర్ధం వుంది.శరత్, హేమంత, శిశిర ఋతువులలో దక్షిణానికి చలిస్తాడు. అది పితృసమయం. దీన్ని దక్షిణాయనమంటారు.

  4. ఇప్పుడు మన చర్చనీయాంశం “సంక్రాంతి” పండగ. ఈ పండుగ పుష్యమాసం హేమంతఋతువులో వస్తుంది. దక్షిణాయనం నుండి ఉత్తరాయాణమునకు రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక దీనిని మకరసంక్రాంతి అంటారు. దక్షిణాయనం నుండి ( అశుభ) శుభప్రదమైన జీవన యానంలోకి అడుగుపెట్టే శుభ తరుణం. ఈ పండుగను మూడు రోజులు జరుపుకొనే ఆచారం మనది. మనదేశం కృషిప్రాధాన్యం గల దేశం. కృషి అంటె కష్టం, వ్యవసాయం అనే అర్ధాలున్నాయి. కృషీవలుడు ( రైతు) సంవత్సరమంతా కష్టపడి చెమటోడ్చి పండించిన పంట చేతికి వొచ్చే సమయం. రైతే దేశానికి వెన్నెముక, అన్నదాత. ఇలా ధాన్య లక్ష్మి ఇంటికి వొచ్చే తరుణంలో ప్రత్యేకంగా గ్రామీణులు ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగ. ఆనందం వుప్పొంగిన హృదయంతో రైతు ధాన్యలక్ష్మిని స్వాగతిస్తాడు. తన ఆనందానికి తోడ్పడిన డూ డూ బసవన్నలను (ఎడ్లను) అందంగా అలంకరించి ఆనంద నాట్యం చేయిస్తాడు. వాటి కొమ్ములకు బంగారు పూతలు పూయిస్తాడు. తనకు సహకరించిన సూర్యభగవానునికి భక్తితో పూజలు చేస్తాడు. మొదటి రోజు భోగి పండుగ. ఆ రోజు భోగి పండుగ. ఆ రోజు భోగిమంటలు వేసుకొని వున్న కాస్త చిరు చలిని పారద్రోలటానికి చేసె ప్రయత్నం.ఒకరకంగా చెప్పాలంటె పాడైపోయిన పాత వస్తువులని తీసేసి కొత్తకు స్వాగతం పలకటం ( ఇంట్లో చెత్త పేరుకోకుండ) విరిగిన పాడైపోయిన వాటిని అగ్నికి ఆహుతి చెయ్యటం. దక్షిణాయనానికి వీడ్కోలు చెప్పి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికే అతి మంచి రోజు. కొన్ని ప్రాంతాలలో ముత్తైదువులను పేరంటాలకు పిలిచి చిన్న పిల్లలకు “భోగిపండ్లు” ( రేగిపండ్లు, శనగలు, బంతిపూలు. అక్షతలు. చిల్లరనాణాలు ఈ 5 రకాలు కలిపి) పోసి పసుపు కుంకుమ పళ్ళు శనగలు దక్షిణ తాంబూలాలు తమ తమ శక్తికొలది వాయనం ఇస్తారు. పిల్లలు ఆయురారోగ్యాలతో వుండాలని పెద్దలు (సువాసినులు) ఆశీర్వదిస్తారు. కోడి, చిలుక లాంటిచక్కెర అచ్చులను. నువ్వులు – బెల్లం/పంచదార కలిపిన వుండలు కూడా ఇచ్చే అచారం వుంది.

  రెండవ రోజున ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు ఈ మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైన్ రోజు. ఫ్రాత: కాలమే లేచి అభ్యంగన స్నానం చేసి తమ శక్తి కొలది నూతన వస్త్రాలను ధరించి భగవంతుని పూజించి పెద్దల ఆశీర్వాదం తీసుకొని కొత్తగా వొచ్చిన ధాన్యం కొత్తబెల్లం పాలు కలిపి పొంగలి తయారు చేసి ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానునికి నివేదన చేసి ఆ ప్రసాదం అందరూ స్వీకరిస్తారు. కుటుంబములోని చిన్న, పెద్ద, పాలేర్లు, జీతగాళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ తరతమ బేధాలు లేని తత్వంతో కలసి భోజనం చేస్తారు. తమ జీవితాలు ఆనందమయం కావాలని భగవంతుని మన్స్ఫూర్తిగా కోరుకుంటారు.ఈరోజుననే శబరిమలలో మకరజ్యోతి దర్శనమిస్తుంది.
  ఇక మూడవ రోజు కనుమ కనుమ రోజున కోడెదూడలను అలంకరించి వాటికి భక్ష్యములు తినిపించి ఆ మూగజీవులపై తమకున్న ప్రేమను విశ్వాసాన్ని ప్రకటించుకుంటారు. కనుమ రోజున ఎవరినీ ప్రయాణం చేయనివ్వరు. “కనుమనాడు కాకి కూడా కదలదని ” శాస్త్ర వచనం. ఆ తరువాత అంటే 4వ రోజు ముక్కనుమ కనుమ పీడ అని ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకొని భోజనం చేసిన పిదపనే ప్రయాణానికి అనుమతిస్తారు. దీనినే ముక్కనుమ అంటారు.

  శాస్త్రీయత : – స్త్రీలు ధనుస్సంక్రమణం రోజునుంచే అంటే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన రోజునుంచి చలి పులి వణికిస్తున్నా లెక్క చేయక తెల్లవారుఝాముననే లేచి వాకిలి శుభ్ర పరచి పేడ నీళ్ళతో కళ్ళాపి చల్లి రంగు రంగుల రంగవల్లికలు (ముగ్గులు) అందంగా తీర్చిదిద్దుతారు. ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి పసుపు, కుంకుమ, వరిపిండితోనూ పూలతోను అలంకరించి అందమైన ముగ్గులమీద అత్యంత అందంగా అమరుస్తారు.

  1. చలికాలంలో తెల్లవారుఝామున లేస్తే చలి వణికించదు. సూర్యోదయంతో చలి పెరుగుతుంది. తెల్లవారు ఝామున చేసె పనులవలన శరీరానికి కావలసిన వ్యాయామం జరుగుతుంది.

  2. పేడ వలన క్రిమికీటకాలు నశిస్తాయి.

  3. ఆవుపేడలో ఔషధ గుణాలున్నాయి. (నీటితో పని చేయవలసిన స్త్రీలకు) గోళ్ళు పుచ్చడం, కాళ్ళు పాయడం వంటివి రావు. ఇకపోతె పసుపు కుంకుమ మంగళ చిహ్నాలే కాక Antibiotics కూడా. వీటితో కూడిన గాలి ని పీల్చే ఆ శ్వాశ మంచిది. చల్లదనం వల్ల పెరిగే క్రిమికీటకాలను పేద ముగ్గుపిండి పసుపు మొదలైనవి నశింపచేస్తాయి. ఇక వరిపిండి కొన్ని జీవులకు ఆహారం. చూశారా ప్రతి జీవికి ఆహారాన్ని అందిచాలనుకొనే గొప్ప సంస్కృతి మనది.

  కొంతమంది బొమ్మల కొలువులు పెడతారు. దీనిద్వారా అనేక రకాలైన సాంఘిక, పౌరాణిక, నీతికధా సారాంశాలను భావి తరాలకు అందించటమేకాక వారి కళాకౌశలం కూడా ప్రస్ఫుటమవుతుంది. అంతేకాక పేరంటాలవలన ఒకరితో ఒకరికి పరిచయాలు పెరగటం, ఆచార వ్యవహారాలు, సామాజిక స్పృహ మొదలైనవి పెరుగుతా యి. వారు వేసె ముగ్గుల్లో కళానైపుణ్యమే కాకుండా పౌరాణిక కధలు కూడా గోచరమవుతాయి. ఉదాహరణకు పద్మవ్యూహమ్ముగ్గు, ధాన్యపుకుండలు, రధాలు, స్వర్గద్వారాలు మొదలైనవి. ఇంతే కాక వీధి వీధిన హరిదాసుల సంకీర్తనలు. గంగిరెద్దుల మేళాలు యెంతో శ్రావ్యంగా ఆనందోత్సాహాలతో ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. ఎడ్లపందాల జోరు, కోళ్ళ పందాలు ( ఈకోళ్ళ పందాల వలన పంతాలు పెరగటం గొడవలు వలన ప్రభుత్వం నిషేధించింది) అన్నదానాలు, బ్రాహ్మణ సత్కారాలు మొదలైనవి మన సాంప్రదాయానికి అద్దం పడతాయి. కొత్తధాన్యం, కొత్తగా పెళ్ళైన జంటలు, అల్లుళ్ళు – కూతుళ్ళు, ఆడపడచులు పుట్టింటికి రావటం. తల్లితండ్రులు, సోదర-సోదరీలు, బంధు – మిత్రుల సమాగమం. మృష్టాన్న భోజనం, నూతన వస్త్రధారణ, ఆభరణముల అలంకరణలతో మనసులోని ఆనదం ముఖముపై ప్రతిఫలిస్తుండగా ఈ పండుగ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు.
  ఇక పౌరాణికానికి వొస్తే ధనుర్మాసంలోనే గోదాదేవి శ్రీరంగనాధుడిని అర్చించి ఆయన కరుణ పొంది చివరకు ధనుర్మాసం చివరి రోజు అయిన భోగి రోజున ఆ స్వామిని వివాహం చేసుకొని ఆయనలో లీనమైనట్లు పురాణ కధనం.

  అఖిల జగత్తుకు ప్రత్యక్ష దైవం సూర్యుడు. ( ఈ సంక్రమణమనేది సూర్యునికి సంబంధించినదే కనుక సూర్యుని పూజించటమే ఆచారం) యే ప్రాణి కూడా సూర్య శక్తి లేనిదే జీవించలేదు. ఈ చరాచర జగత్తులో దేనినైనా సృష్టించి పెంచే దివ్యశక్తి ఒక్క సూర్యభగవానునికే వుంది. అగ్ని వాయువు (ప్రతిజీవి) ఉచ్వాస నిశ్వాసాలు, గ్రహ నక్షత్రాలు, రాశులు భూమి, నదీనదాలు, ప్రతిదానికి సూర్యుడే ఆధారం. పంచ భూతాత్మికమైన ఈ శరీరానికి శక్తినిచ్చేవాడు ఈ గ్రహ రాజైన సూర్యుడే. అందుకే ” ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్” అన్నారు. జ్యోతిష పరంగా ఆత్మ కారకుడు, పితృకారకుడు కూడా ఆదిత్యుడె. సింహరాశికి అధిపతి ఈ భాస్కరుడు. ఈ మకర సంక్రాంతికి సూర్య దేవునికి పూజ, సూర్యోపాసన, సూర్యారాధన చాలా శ్రేష్టం. అసలు నిత్యం ఆదిత్యహృదయ పారాయణ, సూర్య నమస్కారాల వలన దీర్ఘ కాలిక అనారోగ్యాలు నశించి ఆరోగ్యవంతులు అగుటయే కాక అనేక భోగములు అనుభవించుదురు. ఆదిత్య హృదయ పారాయణవలన శతృబాధ నివారణ అగును.

  ఈ హేమంత ఋతువునందు తామ్రవర్ణుడుగ (రాగిరంగు) 900 కిరణములతో సూర్య బింబం ప్రకాశిచుచూ ఆయా ఋతు స్వభావ ధర్మములను ప్రకృతికొసంగి సృష్టికి క్షేమమును సుభిక్షమును ఇచ్చు చున్నాడు. 12 నెలలో 12 మార్పులు చెందు తున్నందు వలననే ద్వాదశాదిత్యుడని నామ ధేయము కలదు. మన పండుగలు నైవేద్యాలలో శాస్త్రీయత ఆరోగ్యం ( కాలమార్పులకు అనుగుణంగా) ఆనందాలే కాక లౌకిక జీవితాన్నుంచి ఆధ్యాత్మిక చింతనకు మార్గదర్శకాలు. యెన్నో అర్ధాలను అంతరార్ధాలను కలిగివున్న ఈ పండుగలు సర్వదా ఆచరణీయాలు అన్ని మతాల సారం సర్వమానవ సౌభ్రాతృత్వము. సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజనా సుఖినో భవంతు.

  ఈ సారి అనగా స్వస్తి శ్రీ శోభకృతు నామ సంవత్సరం పుష్యమాస శుక్ల తదియ ఉపరి చవితి ది. 14-01-2024 ఆదివారం రాత్రి గం2.43ని.లకు తెల్లవారితే సోమవారం వృశ్చిక లగ్నం, శతభిషానక్షత్రం 3వ.పాదం, వ్యతీపాత యోగం, భద్ర కరణం మందు సూర్యభగవానుడు అశ్వవాహనముపై ద్వాంక్ష నామధేయుడై మకర రాశి లో ప్రవేశించు చున్నాడు కనుక 14భోగి,15మకరసంక్రాతి,16కనుమ. ముఖపుస్తక మిత్రులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

  Share post:

  More like this
  Related

  Windows : విండోస్  లోసాంకేతిక లోపాలు.. ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన సేవలు

  Windows Windows : జూలై 19 ఉదయం నుంచి బ్యాంకులతో సహా మైక్రోసాఫ్ట్...

  Darling Movie : మూవీ రివ్యూ : డార్లింగ్ హిట్టా.. ఫట్టా..?

  డైరెక్షన్ : అశ్విన్ రామ్ నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్యరెడ్డి సినిమాటోగ్రఫి: నరేష్ ఎడిటర్: ప్రదీప్...

  Gautam Gambhir : గౌతమ్ గంభీర్ చెప్పినట్లే చేస్తున్నాడా?

  Gautam Gambhir : భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు...

  Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. పది జిల్లాలకు రెడ్ అలర్ట్

  Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం భారీ నుంచి...

  POLLS

  [yop_poll id="2"]

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  CANADA: కెనడా లో సంక్రాంతి సంబరాలు

        తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా ఆద్వర్యంలో   సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తాకా...

  Sankranti : తెలుగు రాష్ట్రాల్లో అబంరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

    నూతన సంవత్సరంలో  వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి..ఈ పండుగను భారతదేశవ్యాప్తంగా ప్రజలు...

  Goda Kalyanam : గోదా కళ్యాణం

  Goda Kalyanam : కోదై లేదా ఆణ్డాళ్ లేదా గోదా కళ్యాణం...

  Sun Light: సూర్యుడు ఒక్కడే శక్తికి మూలం.. ఆ సంస్థల మాటలు నమ్మవద్దు!

  Sun Light: ప్రతీ జీవి జీవించేందుకు ప్రకృతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది....