Thati Munjalu : సీజనల్ ఫ్రూట్స్ గా వేసవిలో వచ్చే తాటి ముంజెలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా చాలా పండ్లు పక్వానికి చేరే దశకు ముందే కొంచెం కొంచెం కరాబవుతుంటాయి. కానీ తాటి ముంజెలు మాత్రం చాలా రకాలుగా ఉపయోగపడతాయి. చిట్ట చివరికి గేగులుగా మారి మరీ పీచు పదార్థాలను ఇస్తాయి. తాటి ముంజెలు శరీరానికి కావాల్సిన నీటిని అందించడం నుంచి క్యాన్సర్ కారకాలను నిలువరించే వరకు ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఒక వేళ తాటి చెట్టుపై ఉంటే ‘పండు కళ్లు’ రూపంలో గౌడన్నలకు కాసులను కురిపిస్తాయి.
జామ, అరటి, మామిడి లాంటి పండ్ల తీరు, తాటి ముంజెల తీరు చాలా వరకు భిన్నం. తాటిచెట్ల పైనుంచి తాటికాయల్ని దింపడం, కాయలను కత్తితో కొట్టడం.. పెద్ద ప్రయాసే. తినడమూ అంత సులువేం కాదు.. గుండ్రని తాటికాయ పైన డిప్పను కోయగానే కాయను బట్టి రంధ్రాలు ఉంటాయి. వాటిల్లో పసుపు, నారింజ రంగు తొక్కలతో ముంజెలు ఉంటాయి. ఇవి లేతవైతే వేళ్లతో పొడిచి జుర్రుకోవాలి.. కాస్త ముదురుగా ఉంటే తీసుకొని తినాలి. ఆ తతంగమంతా ఎలా ఉన్నా.. చెట్టు పైనుంచి నోట్లోకి చేరేవరకూ శ్రమే..
చాలా పేర్లు..
తాటి ముంజెల శాస్త్రీయనామం ‘బోరాసస్ ఫ్లాబెల్లిఫెర్’ తాటిముంజెల్ని- తెల్లని రూపమూ చల్లని తీరునూ బట్టి ఇంగ్లిష్ లో ‘ఐస్ ఆపిల్’ అనీ, తమిళంలో నుంగు, కన్నడలో తాటి నుంగు, బంగ్లాలో తాల్.. ఇలా ఒక్కో చోట ఒక్కో పేరు ఉంటుంది. పొడి, ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే ముంజెలు దక్షిణాసియాకు చెందినవని అంటారు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ లో అధికంగా ఉంటాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు విరివిగా దొరికే ఈ ముంజెలు దేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, మహారాష్ట్రలో మరింత ఎక్కువగా కనిపిస్తాయి. ముంజెకు ఉన్న క్రేజ్ వల్ల పల్లెటూళ్లతోపాటు పట్టణాల్లోనూ తాటికాయలను గుట్టలుగా పోసి అమ్ముతుంటారు.
ప్రయోజనాలెన్నో..
*అధిక శాతం నీటిని కలిగి ఉన్న తాటిముంజెలు కూలింగ్ ఏజెంట్‌గా పని చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తాయి. రోజంతా చురుగ్గా పని చేసేందుకు కావాల్సిన శక్తినిస్తాయి.
*తక్కువ క్యాలరీలు, పీచు, ఎక్కువ కాల్షియం, ప్రొటీన్లు, ఐరన్, జింక్.. విటమిన్-సీ, విటమిన్-ఏ, విటమిన్-ఈ, విటమిన్-కే, విటమిన్-బీ7లతో కూడి ఉన్న ఈ ముంజెలు వేసవిలో సూపర్ ఫుడ్.
*దీంట్లోని సోడియం, పొటాషియం శరీరంలో ఎలక్ట్రొలైట్ల సమతుల్యతను కాపాడడంలో సాయపడతాయి. వేడిమి కారణంగా కోల్పోయిన పోషకాలను తిరిగి సమకూరుస్తాయి. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తాయి.
*తాటి ముంజెల్లో నీరు పిల్లలకు, వృద్ధులకూ తేలికగా అరుగుతుంది. ఎసిడిటీ, మలబద్ధకం, అల్సర్ సమస్యలను నివారిస్తూనే జీర్ణక్రియ పెంచుతుంది.
*గర్భిణులు మిగతా ఆహారంతోపాటు వీటిని తీసుకున్నారంటే వాంతులు వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు. బాలింతలు తింటే ఎక్కువ మొత్తంలో పాలు పడతాయట.
*వేసవిలో చెమటకాయలు లేచి దద్దుర్లు, స్కిన్ అలర్జీ వస్తుంటుంది. ముంజెలను తిన్నా, గుజ్జును శరీరానికి రాసుకున్నా సమస్యలు తగ్గుతాయి. జుట్టుకూ సహజసిద్ధమైన కండిషనర్‌గా మారి కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తాయి.
*అధిక పొటాషియం ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపేందుకు, లివర్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సహకరిస్తాయి. పొటాషియం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
*బరువు తగ్గాలని అనుకుంటే ముంజెలు మంచి ఆహారం. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటితో ఉంటుంది కాబట్టి సన్నబడటంలో సాయపడతాయి. ఇవి తిన్న వెంటనే కడుపు నిండిన భావనతో తక్కువ ఆహారం తీసుకుంటారు.
*ఆడవాళ్లు ఎదుర్కొనే మూత్ర సంబంధిత వ్యాధుల నుంచి ముంజెలు కాపాడతాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు యూరిన్ ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయట.
*మెగ్నీషియం, ప్రొటీన్లు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతూ తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
*లేత ముంజెలను పొట్టుతో సహా తింటే పీచు పదార్థాలు అందుతాయి.
*యాంటీ హైపర్ గ్లైసెమిక్ ఏజెంట్‌గా పనిచేస్తూ డయాబెటిస్‌తో ఇబ్బంది పడేవాళ్లకు ముంజెలు ఉపయోగపడతాయి.
*వివిధ రకాల ట్యూమర్లూ, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను వృద్ధి చేసే కారకాలను నిర్మూలించే పోషకాలు తాటి ముంజెల్లో ఉన్నాయి.
*శ్వాసకోశ ఇబ్బందులతో పాటు దగ్గు తగ్గించడంలో ముంజెల పాత్ర ఉంది.
*పోషకాహార లోపం తగ్గిస్తూ శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషక గుణాలతో నిండిన ముంజెలు.. అమృత ఫలాలే.
ఉత్పత్తులు..
ఈ తాటి ముంజెలు కేవలం వేసవిలో మాత్రమే దొరుకుతాయి. మిగిలిన సీజన్లలో కనిపించవు. కానీ, మరో రూపంలో దొరుకుతాయి. తాటికాయల్లోంచి ముంజెలను తీయకుండా వదిలేస్తే తాటి పండ్లుగా మారుతాయి. గుజ్జు తీసి వాటిని అలాగే మట్టితో కప్పి ఉంచితే తేగలు (గేగులు)గా వస్తాయి. ఆ తాటి తేగల్ని టెంక నుంచి వేరు చేసి తినొచ్చు లేదంటే అవే తాటి మొక్కలుగా మారుతాయి.