![Zero Current Bill](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-01-at-10.25.15-AM.jpeg)
Zero Current Bill : ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రెండు హామీలను పట్టాలెక్కించిన రేవంత్ సర్కార్ తాజాగా మరో రెండు గ్యారెంటీలను అమలులోకి తెచ్చింది. గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ను అర్హులకు అందించనుంది. మార్చి 1వ తేదీ(నేడు)నుంచి ఈ పథకం అమల్లోకి వస్తోంది. ఈ రోజు నుంచే విద్యుత్ కస్టమర్లకు జీరో బిల్లులు జారీ కానున్నాయి.
ప్రజాపాలన దరఖాస్తులలో అప్లై చేసుకున్న వారికి ఉచిత విద్యుత్ అందించనుంది. విద్యుత్ సిబ్బంది మీటర్ చెక్ చేసి 200లోపు యూనిట్లు ఉన్నవారికి జీరో బిల్లు జనరేట్ చేసి బిల్లు ఇవ్వనున్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్నవారిని అర్హులుగా నిర్ణయించింది. ఈ పథకాన్ని ఇటీవలే సచివాలయంలో సీఎం రేవంత్ మంత్రులతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
నేటి నుంచి హైదరాబాద్ పరిధిలో గృహజ్యోతి కింద జీరో కరెంట్ బిల్లులు ఇవ్వనున్నారు. ఇందుకోసం బిల్లింగ్ యంత్రాల సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. రేషన్ కార్డు ఉండి ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడితేనే ఇది వర్తిస్తుంది. ఈ జీరో బిల్లులో యూనిట్లు, బిల్లు ప్రింట్ చేసి.. గృహజ్యోతి సబ్సిడీ కింద మొత్తం బిల్లును మాఫీ చేసి జీరోగా చూపిస్తారు. త్వరలోనే ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలుకానుంది.
కాగా, అర్హులుగా రేషన్ కార్డు దారులనే నిర్ణయించగా..రేషన్ కార్డులేనివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో పేదలమైన తమకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని అంటున్నారు. వెంటనే తమకు రేషన్ కార్డులు పంపిణీ చేసి ఉచిత కరెంట్ కు అర్హులుగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.