
Hastam : వరుసగా ఓటమి పాలవుతున్న హస్తం పార్టీ (కాంగ్రెస్) తిరిగి బలాన్ని పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఏడాది ప్రారంభంలో హిమాచల్ ప్రదేశ్ కట్టబెట్టిన విజయోత్సాహం కాంగ్రెస్ నేతల్లో బూస్ట్ నింపిందనే చెప్పాలి. అదే జోరుతో ఇప్పుడు సౌత్ లో కీలకరాష్ట్రం కర్ణాటకను హస్తంలో కలుపుకుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా ఫలితాలు పూర్తిగా మార్చివేశాయనే చెప్పాలి. కాంగ్రెస్ గెలుపు, లేదా హంగ్ అంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్తే.. కాంగ్రెస్ మాత్రం అత్యంత భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.
1. సానుభూతి
కర్ణాటకలో గత ఎన్నికల్లో (2018) ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కానీ బీజేపీ మాత్రం కన్నడ క్షేత్రాన అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే అక్కడ జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఏడాది వరకే కొందరు ఎమ్మెల్యే తిరుగుబావుటా ఎగరేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ తో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి తమ పదవులను దక్కించుకున్నారు. అయితే గత ప్రభుత్వం కూలడానికి బీజేపీనే కారణమనే ఆరోపణలు వినిపించాయి. ఇది ప్రజల్లోకి బలంగా నాటుకుపోయింది. దీంతో సాధారణంగానే కాంగ్రెస్ పై సానుభూతి పెరిగింది. 2023 ప్రచారంలో కాంగ్రెస్ నేతలు దీన్ని ప్రచార హస్తంగా మార్చుకోవడంతో వారికి ఇప్పుడు పూర్తి మెజారిటీ దక్కింది.
2. ‘40 శాతం కమీషన్’ నినాదం
బసవరాజు బొమ్మై సర్కార్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపించాయి. దీన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకుంది హస్తం పార్టీ. బీజేపీ ప్రభుత్వాన్ని ‘40 శాతం కమీషన్ సర్కార్’ అంటూ విమర్శలు చేసింది. ఇక అదే సమయంలో అవినీతికి పాల్పడుతున్నాడంటూ మంత్రి ఈశ్వరప్పపై కేసు నమోదవడం బీజేపీ ప్రభుత్వాన్ని కుదిపేసింది. మరో ఎమ్మెల్యే విరూపాక్షప్ప నివాసంలో కూడా కోట్లాది రూపాయల డబ్బు దొరకడం కూడా సంచలనమైంది. 40 శాతం కమీషన్ సర్కార్, పే సీఎం అంటూ కాంగ్రెస్ ప్రచారం నిర్వహించింది.
3. హిమాచల్ వ్యూహం కూడా ఫలించింది
హిమాచల్ ప్రదేశ్ లో మాదిరిగానే కర్ణాటకలో వ్యూహం రచించింది కాంగ్రెస్. ఐదు గ్యారెంటీలు అంటూ పథకాలను ప్రవేశపెట్టింది. గృహజ్యోతి పథకం అంటూ ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్. 1.5 కోట్ల మందికి ఒక్కొక్కరికి రూ. 2వేల ఆర్థికసాయం. అన్నభాగ్య పథకం కింద ప్రతీ పేద కుటుంబానికి 10 కిలోల బియ్యం. యువనిధి యోజన కింద నిరుద్యోగ పట్ట భద్రులు, డిప్లమా పట్టా దారులకు నెలకు రూ. 3వేలు, రూ. 1500 చొప్పున నిరుద్యోగ భృతి, ప్రభుత్వ రవాణా వాహనాల్లో మహిళలకు ఉచిత రవాణా వసతి కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీజేపీ ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం తొలగించి కర్ణాటక విద్యా విధానం అమలు చేస్తామని తెలిపింది. బీజేపీ తీర్మానించిన ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ రద్దును తొలగిస్తామని, ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జనాభా దమాషాగా రిజర్వేషన్ ప్రమాణాలను సవరిస్తామని పార్టీ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను 75శాతంకు పెంచుతామని చెప్పింది.
4. జోష్ నింపిన జోడోయాత్ర
బీజేపీయేతర శక్తుల బలం చాటేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర ఫలితం సాధించింది. ఈ జోడో యాత్ర కర్ణాటక గుండా వెళ్లింది. వర్గ పోరుతో సతమతమవుతున్న కర్ణాటక కాంగ్రెస్ ఇటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య వర్గాలుగా విడిపోయింది. జోడో యాత్రతో ఇద్దరు నాయకులు ఒక్కటయ్యారు. ఈ యాత్ర మొత్తం 140 రోజులు సాగగా అందులో అత్యధికంగా 21 రోజులు కర్ణాటకలోనే సాగింది. చామరాజనగర్ జిల్లా, గుండ్లపేట నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన యాత్ర 511 కిలో మీటర్లు రాష్ట్రంలో పర్యటించారు. మైసూర్, మాండ్య, తూమకూరు, చిత్రదుర్గ, బళ్లారి జిల్లాలో పర్యటన సాగింది. యాత్ర మధ్యలో భారీ వానలో ఓ సభలో రాహుల్ ప్రసంగం అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే ఎన్నికవడం కూడా కాంగ్రెస్ కు ప్లస్ గా మారింది.
5. కలిసిన డీకే, సిద్ధూ
ఆ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులే అంటూ గతంలో కాంగ్రెస్ ను ఉద్దేశించి బీజేపీ మాట్లాడింది. తాజా ఎన్నికల్లో అలాంటి విమర్శలకు తావివ్వకుండా కాంగ్రెస్ వ్యవహరించింది. పార్టీలో అంతర్గత విభేదాలను కూడా బయటకు పొక్కనీయకుండా చూసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్య కలిసి కట్టుగా కనిపించారు. కేపీసీసీ అధ్యక్షుడిగా శివకుమార్ సమర్థవంతంగా పని చేశారు. అన్ని వర్గాలను ఏకదాటిపైకి తెచ్చారు. బీజేపీ ఐటీ దాడులను సైతం ఎదుర్కొన్నారు. కేడర్ లో విశ్వాసం నింపారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని ఎదుర్కొనేందుకు తమది జోడెద్దుల బండి (డీకే సిద్ధూ) అంటూ ప్రచారం చేశారు. ఇది కర్ణాటక ప్రజలను ఎంతో ఆకట్టుకుంది.