Election దేశంలో పొలిటికల్ హీట్ మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్షాల కూటములు బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ప్రతిపక్షాల కూటమి బెంగళూరులో రెండో విడత సమావేశం నిర్వహిస్తుండగా, అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమి ఢిల్లీలో ఈరోజు సాయంత్రం సమావేశానికి సిద్ధమైంది. ప్రతిపక్షాల కూటమిలో సుమారు 26 పార్టీలు, అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కూటమిలో సుమారు 38 పార్టీలు పాల్గొంటున్నట్లు తెలుస్తున్నది. ఈ సమావేశాల ద్వారా ఇక సార్వత్రిక ఎన్నికలకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పడమే పక్షాల అసలు ఉద్దేశం. కీలక నేతలతో ప్రతిపక్ష కూటమి ఇప్పటికే ఎన్డీఏ పై సమరశంఖం పూరించింది. అంతా కలిసికట్టుగా ప్లాన్ ను సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ర్టాలకు చెందిన కీలక నేతలు ఈ రెండు కూటముల్లో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది.
అయితే ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన పార్టీలేవీ ఈ రెండు పక్షాల వైపు సమావేశాల్లో పాల్గొనక పోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్. టీడీపీ, వైసీపీ పార్టీలకు ఈ రెండు కూటమిల నుంచి ఆహ్వానాలు అందలేదు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించాక బీజేపీకి తామే ప్రత్యామ్నాయమంటూ చెప్పుకున్నది. కానీ ఎక్కడ ఆ స్థాయిలో పోరు చేసిన సందర్భాలు లేవు. పైగా ఇటీవల ఢీలా పడిపోయింది. అడపాదడపా మహారాష్ర్టలో ఒకటి, రెండు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఢిల్లీ లిక్కర్ కేసు పుణ్యామాని ఇప్పుడు అస్ర్త సన్యాసం చేసినట్లు కనిపిస్తున్నది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ నమ్మడం లేదు.
గత అనుభవాలే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. కేసీఆర్ ఎప్పుడు ఎవరి వైపు ఉంటారో తెలియక ఆయా కూటములు ఆయనకు ఆహ్వానం పంపలేదని సమాచారం. తెలంగాణలో ఆయన బలంగా ఉన్నారు. ఆయనపై కాంగ్రెస్ రాష్ర్ట నాయకులు బలంగా పోరాడుతున్నారు. ఈ సమయంలో ఆయనను ఈ మీటింగ్ పిలవడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. మరోవైపు బీజేపీ పై ఆయన తీవ్రస్థాయి విమర్శలు చేస్తున్నా, లోపాయికారీ ఒప్పందం ఉందని ఇటీవల టాక్ బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఆయనను ఎన్డీఏ భేటీకి పిలవడం బీజేపీకి నష్టం చేస్తుంది.
ఇక గతంలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన సీనియర్ నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ను కూడా రెండు పక్షాలు ఆహ్వానించలేదు. గతంలో జాతీయస్థాయిలో ఆయన కీలకంగా వ్యవహరించారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్డీఏ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. అబుల్ కలాం ను రాష్ర్ట పతిగా చేసే సమయంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి ఉన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా బీజేపీపై యుద్ధభేరి మోగించారు. కాంగ్రెస్ కు అనుకూలంగా దేశమంతా తిరిగారు. అయితే గత ఎన్నికల్లో ఆయన దారుణంగా ఓటమిపాలవడం, ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీని శరణు కోరడం తప్పని పరిస్థితి ఎదురైంది.
ఇక ఆయన బీజేపీతో కొంత సఖ్యతతో ఉన్నా, పిలుపు మాత్రం అందలేదు. ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆయనకు ఆహ్వానం అందలేదు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కు కూడా ఇరు కూటముల నుంచి ఆహ్వానం లేదు. ప్రతిపక్షాల కూటమిని జగన్ గతంలోనే విమర్శించారు. అంటే ఆయన ఎన్డీఏకు దగ్గర కావాలని అనుకుంటున్నారని వారు భావించి ఉంటారు. అయితే ఇదే సమయంలో ఎన్డీఏ కూడా ఆయనను పూర్తిస్థాయిలో దగ్గరకు తీయడం లేదు. కేవలం రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నది. ఇప్పుడు వైసీపీని పిలిస్తే టీడీపీ కి కోపం, టీడీపీని పిలిస్తే వైసీపీ కి కోపం అన్నట్లు ఉంది పరిస్థితి. అందుకే ఏపీలో ఈ రెండు పార్టీలను ఎన్డీఏ సమావేశానికి పిలవలేదు. కానీ ఈ రెండు పార్టీలు ఎన్డీఏ లో చేరేందుకు తహతహలాడుతున్నాయని అందరికీ తెలిసిన విషయమే.